మూసీ వ్యయం​.. 6నెలల్లో 1350 కోట్లు ఎలా పెరిగింది?: కవిత

కలం, వెబ్​ డెస్క్​ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు (Musi Rejuvenation Project) కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని, ఇందులో జవాబుదారీతనం లోపించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. సెప్టెంబరులో విడుదల చేసిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టులో ప్రాజెక్టు ఫేజ్-1 వ్యయం 5,641 కోట్లుగా పేర్కొన్న ప్రభుత్వం, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఆ మొత్తాన్ని 7,000 కోట్లకు పైగా ఎలా పెంచిందో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహానికి 200 కోట్లు ఖర్చు చేస్తే, మిగిలిన 1,200 కోట్ల అదనపు భారం ఎందుకు పెరిగిందో స్పష్టం చేయాలన్నారు. ఈ భారీ వ్యయంతో ప్రజలకు ఎంతో మేలు చేసే సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని ఆదివారం మీడియా సమావేశంలో ఆమె పేర్కొన్నారు.

ప్రభుత్వం నిర్వహించిన ప్రెజెంటేషన్ కార్యక్రమం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల కోసమే జరిగిందని, అసలైన బాధితులను ప్రభుత్వం విస్మరించిందని కవిత ఆరోపించారు. ప్రాజెక్టు వల్ల ఇండ్లు, భూములు కోల్పోతున్న వేలాది మందిని, సుమారు 3 వేల ఎకరాల నిర్వాసితులను ఈ చర్చలకు ఎందుకు పిలవలేదని ఆమె ప్రశ్నించారు. ప్రజాభిప్రాయాన్ని వినకుండా ముఖ్యమంత్రి ఏకపాత్రాభినయం చేస్తున్నారని, ఆయన తీరు చూస్తుంటే చిన్న మోడీలా కనిపిస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ ప్రభుత్వాలు మూసీ విషయంలో రకరకాల ప్రయత్నాలు చేశాయని, అయితే 2015లో కేంద్ర పర్యావరణ శాఖ తిరస్కరించిన ప్రతిపాదనలకు ఇప్పుడు అనుమతులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.

మూసీలోకి చేరుతున్న 16 ప్రధాన నాలాల మురుగు నీటి నివారణపై ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదని కవిత ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చెబుతున్న నాలుగు ఎస్టీపీలు ఏమాత్రం సరిపోవని, ఫార్మా వ్యర్థాలు, గృహ వ్యర్థాలు నదిలో కలవకుండా తీసుకుంటున్న చర్యలేమిటో స్పష్టత లేదని పేర్కొన్నారు. జియాగూడ వంటి ప్రాంతాల్లో కబేళాల వ్యర్థాలు నేరుగా నదిలోకి వెళ్తున్నా ప్రభుత్వం కనీసం స్లాటర్ హౌస్‌లు నిర్మించలేకపోతోందని మండిపడ్డారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని తెస్తామని చెబుతున్న పనులు ఇంతవరకు ఎందుకు ప్రారంభం కాలేదని ఆమె నిలదీశారు. అభివృద్ధి పేరుతో 1,431 ఆస్తులను తొలగించడంపై స్పష్టత ఇవ్వాలని, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అయ్యే అదనపు ఖర్చుల వివరాలను బహిర్గతం చేయాలని కవిత (Kavitha) డిమాండ్ చేశారు.

ప్రభుత్వ నిర్ణయాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు అర్బన్ రూల్స్ గురించి వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే కాకుండా, ప్రజల పక్షాన నిలబడి ప్రాజెక్టును పారదర్శకంగా చేపట్టాలని కవిత పేర్కొన్నారు.

 Read Also: వైర‌ముత్తుకు విషెస్‌.. క‌మ‌ల్, ర‌జినీల‌పై చిన్మ‌యి ఫైర్‌

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>