కలం, వెబ్ డెస్క్: ప్రముఖ తమిళ కవి వైరముత్తు (Vairamuthu)కు ‘జ్ఞానపీఠ్’ పురస్కారం ప్రకటించడంపై సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ‘మీటూ'(MeToo) ఉద్యమం సమయంలో వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయనకు పురస్కారం రావడం, ఆయనకు తమిళ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పడంపై సోషల్ మీడియా వేదికగా చిన్మయి మండిపడుతున్నారు.
వైరుముత్తు మహిళలపై వేధింపులకు పాల్పడే వ్యక్తి అంటూ చిన్మయి ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైరముత్తు నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న 17 మంది మహిళల్లో తాను ఒకరినంటూ చెప్పుకొచ్చారు. తనను ఏ కారణంతో పక్కన పెట్టినా మిగిలిన 16 మంది మహిళల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. తమిళనాడులో తనపై వస్తున్న విమర్శలపై చిన్మయి స్పందించారు. తన ప్రవర్తన లేదా పద్ధతులు తనను విమర్శించే వారి ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవచ్చని, కానీ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం మాత్రం ఆపనని స్పష్టం చేశారు.
17 మంది మహిళలు వేధింపుల ఆరోపణలు చేసిన వ్యక్తిని రాజకీయాల్లో ఉన్న శక్తివంతమైన వ్యక్తులు బహిరంగంగా ప్రశంసించడం దారుణమని చిన్మయి మండిపడ్డారు. లైంగిక వేధింపులంటే ఏమిటో అర్థం చేసుకునే కనీస జ్ఞానం మీకు లేదా? అని నిలదీశారు. అమెరికాలోని ఎప్‌స్టీన్ ఫైల్స్ (Epstein Files) గురించి మాట్లాడే వారికి, ఇక్కడ వేధింపులకు పాల్పడే వారిని రక్షించే వారికి పెద్ద తేడా లేదని ఆమె విమర్శించారు. భారతదేశంలో కూడా ఎప్‌స్టెయిన్ తరహా జాబితా బయటకు రావాలని, అప్పుడు తప్పు చేసిన వారిని కాపాడే అసలు ముఖాలు బయటపడతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైరముత్తుకు విషెస్ చెప్పిన సీనియర్ నటులు కమల్ హాసన్ (Kamal Haasan), రజినీ కాంత్ (RajiniKanth)లకు చిన్మయి కౌంటర్ ఇచ్చారు. రజినీ కాంత్ చేసిన పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ మీకు అసలు అర్థం కావట్లేదా? లేదా మీకు అస్సలు అర్థం కాదా? అంటూ ప్రశ్నించారు. కమల్ హాసన్ చేసిన పోస్టుకు రిప్లై ఇస్తూ.. సినిమాల్లో అత్యున్నత స్థానంలో ఉండి, రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు.. ఓ వ్యక్తి ద్వారా తాము వేధింపులకు గురయ్యామని మహిళలంతా సాక్ష్యాలతో సహా చెబుతున్నా వినిపించుకోనట్టు నటిస్తున్నారన్నారు.
ఓటు వేసే మహిళలందరూ ఒకటి గుర్తుంచుకోవాలని, ఇలాంటి మగవాళ్లు ఎప్పటికీ మన పక్షాన నిలబడరని చిన్మయి (Chinmayi) వ్యాఖ్యానించారు. సదరు నాయకుడి సొంత పార్టీకి చెందిన ఒక మహిళా నాయకురాలు కూడా బహిరంగంగానే వైరముత్తు పేరును బయటపెట్టారని వెల్లడించారు. ఎంతమంది మహిళలు మానసిక వేదన అనుభవించినా మగవాళ్లకు అనవసరం అని, వారు ఎప్పుడూ తమ అన్నాదమ్ములు, అంకుల్స్, నాన్నలు, స్నేహితులు, గురువుల పక్షాన మాత్రమే నిలబడతారని చిన్మయి విమర్శించారు.
Read Also: గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యిపై హీరో తల్లి వంట!
Follow Us On: Pinterest

