epaper
Wednesday, February 18, 2026
epaper

ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్‌ చెల్లింపులో కీలక మార్పులు

కలం, వెబ్ డెస్క్: కేంద్ర బడ్జెట్ 2026లో ఇన్‌కమ్ ట్యాక్స్‌(Income Tax Relief)కు సంబంధించి కీలక అప్‌డేట్‌లు ఉన్నాయి. స్లాబ్‌లు, రేట్లలో చెప్పుకోదగ్గ మార్పులు లేవు. అయినా ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న టాక్స్ పేయర్లకు నేరుగా ఉపయోగపడే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఐటీఆర్ ఫైలింగ్, విదేశీ ప్రయాణాలు, విద్యా వైద్య ఖర్చులు, రోడ్డు ప్రమాద పరిహారం వంటి అంశాల్లో ప్రభుత్వం వెసులుబాట్లు కల్పించింది. ఈ మార్పులు పన్ను చెల్లింపుదారుల రోజువారీ జీవితంలో ఉన్న భారం కొంత తగ్గిస్తాయని అధికారులు తెలిపారు.

రివైజ్డ్ ఐటీఆర్ గడువు పెంపు

ఇప్పటివరకు ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత పొరపాటు జరిగితే డిసెంబర్ 31లోపు మాత్రమే సవరించుకునే అవకాశం ఉండేది. చాలామంది ఉద్యోగులు చివరి నిమిషంలో రిటర్న్ వేయడం వల్ల ఎఫ్‌డీ వడ్డీ, చిన్న పెట్టుబడుల లాభాలు మర్చిపోతుండేవారు. తర్వాత గుర్తొచ్చినా గడువు దాటితే రివైజ్ చేసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఈ గడువును మార్చి 31 వరకు పెంచింది. అంటే దాదాపు మూడు నెలల అదనపు సమయం లభిస్తుంది. డిసెంబర్ 31 తర్వాత రివైజ్డ్ రిటర్న్ వేస్తే స్వల్ప ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయినా ఇది చిన్న ఉద్యోగులు, మొదటిసారి టాక్స్ ఫైల్ చేసే వారికి చాలా ఉపయోగకరం. ఉదాహరణకు జూలైలో రిటర్న్ వేసిన ఓ ఉద్యోగి, జనవరిలో FD వడ్డీ మర్చిపోయానని గుర్తిస్తే ఇప్పుడు మార్చి వరకు సవరించుకునే వెసులుబాటు ఉంటుంది. దీని వల్ల పెనాల్టీలు తప్పించుకోవచ్చు, భవిష్యత్తులో నోటీసుల భయం కూడా తగ్గుతుంది.

ఫారెన్‌ టూర్ ప్యాకేజీలపై TCS భారీగా తగ్గింపు

విదేశీ టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకునే వారికి ఇప్పటివరకు భారీ టీసీఎస్ భారం ఉండేది. కొన్ని సందర్భాల్లో 20 శాతం వరకు ముందే కట్ చేసేవారు. ఇప్పుడు ఈ రేటును కేవలం 2 శాతానికి తగ్గించారు. దీని ప్రభావం నేరుగా ప్రయాణ ఖర్చుపై పడుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షల టూర్ ప్యాకేజీ తీసుకుంటే ముందు రూ.25 వేల వరకు టీసీఎస్ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు అదే ప్యాకేజీకి కేవలం రూ.10 వేలే సరిపోతుంది. దీంతో టూర్ ప్లాన్ చేసే సమయంలో చేతిలో మిగిలే డబ్బు పెరుగుతుంది. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లాలనుకునే మధ్యతరగతి వారికి ఇది పెద్ద ఊరటగా (Income Tax Relief) మారనుంది. ముందుగా కట్టిన TCS మొత్తాన్ని తర్వాత రిఫండ్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పుడు తగ్గుతుంది.

విదేశీ రిమిటెన్స్‌పై టీసీఎస్ తగ్గింపు

పిల్లల చదువులు లేదా అత్యవసర వైద్యం కోసం విదేశాలకు డబ్బు పంపే కుటుంబాలకు కూడా ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఇప్పటివరకు 5 శాతం టీసీఎస్ వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని 2 శాతానికి తగ్గించారు. ఈ రేటు రూ.10 లక్షల వరకు వర్తిస్తుంది. ఉదాహరణకు కుమార్తె విదేశాల్లో చదువుకోసం రూ.8 లక్షలు పంపితే ముందుగా రూ.40 వేల వరకు TCS పడేది. ఇప్పుడు అదే మొత్తానికి రూ.16 వేలే చెల్లిస్తే సరిపోతుంది. ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు గణనీయమైన ఊరట. అయితే పెట్టుబడులు, విదేశీ షాపింగ్ వంటి ఇతర అవసరాలకు మాత్రం రూ.10 లక్షలు దాటితే ఇప్పటికీ 20 శాతం TCS కొనసాగుతుంది.

పూర్తిస్థాయి పన్ను మినహాయింపు

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు లేదా వారి కుటుంబాలకు కోర్టు ఇచ్చే నష్టపరిహారంపై వచ్చే వడ్డీకి ఇకపై ఆదాయపు పన్ను ఉండదు. ఇప్పటివరకు ఈ వడ్డీని ఆదాయంగా పరిగణించి టాక్స్ వసూలు చేసేవారు. తాజా నిర్ణయంతో ఆ భారం పూర్తిగా తొలగించారు. ఉదాహరణకు ప్రమాదంలో గాయపడి రూ.10 లక్షల పరిహారం లభించి, దానిపై రూ.2 లక్షల వడ్డీ వచ్చినా ఆ వడ్డీపై ఒక్క రూపాయి కూడా టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ డబ్బు వైద్యం జీవన అవసరాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఈ మార్పు తీసుకొచ్చింది.

పెనాల్టీపై వడ్డీ రద్దు

టాక్స్ పెనాల్టీ విషయంలో అప్పీల్‌కు వెళ్లే వారిపై ఉండే వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటివరకు అప్పీల్ కొనసాగుతున్న సమయంలో కూడా పెనాల్టీపై వడ్డీ పెరుగుతూనే ఉండేది. ఇప్పుడు మొదటి అప్పీలేట్ అథారిటీ వద్ద అప్పీల్ చేసిన వెంటనే ఆ పెనాల్టీపై వడ్డీ నిలిపివేస్తారు. దీని వల్ల కేసు తేలేలోపు భారం పెరగదు. చిన్న వ్యాపారులు ఉద్యోగులు అనవసర ఒత్తిడికి గురికాకుండా న్యాయపోరాటం చేసే అవకాశం ఉంటుంది. బడ్జెట్ 2026లో పెద్ద పన్ను తగ్గింపులు లేకపోయినా, ఈ చిన్న కానీ ప్రభావవంతమైన మార్పులు Indiaలో ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలకు స్పష్టమైన ఉపశమనం ఇస్తాయి. టాక్స్ ఫైలింగ్ సులభమవుతుంది. విదేశీ ప్రయాణాలు చవక అవుతాయి. విద్య వైద్య ఖర్చులపై భారం తగ్గుతుంది. ప్రమాద బాధితులకు పూర్తి ప్రయోజనం అందుతుంది.

 Read Also: మున్సిప‌ల్ ఫ‌లితాల‌పై రాహుల్ గాంధీ కీల‌క వ్యాఖ్య‌లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>