సమ్మర్‌లో మొబైల్ వేడెక్కుతుందా? మీరు చేసే ఈ తప్పులే కారణం!

కలం, వెబ్‌‌డెస్క్: మొబైల్ వినియోగం (Mobile Usage) మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఇది మనకు ఎన్నో సౌకర్యాలను అందిస్తున్నప్పటికీ, అతిగా వాడటం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఎదురవుతున్నాయి. అంతే కాకుండా ఎండాకాలం మొదలైతే మనుషులకే కాదు.. మొబైల్ ఫోన్లకూ వేడి తాకిడి మొదలవుతోందంటున్నారు నిపుణులు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్లు వేడెక్కిపోవడం (Mobile overheating) చాలామందిని ఆందోళనకు గురిచేస్తున్న విషయం.

ఫోన్ వేడెక్కడానికి కారణాలు:
  • ముఖ్యంగా ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం, సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేయడం, వీడియో షూటింగ్ చేయడం వంటి పనుల వల్ల మొబైల్ ప్రాసెసర్‌పై అధిక భారం పడుతోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీంతో ఫోన్ ఒక్కసారిగా హీట్ అవుతూ పనితీరు మందగిస్తుందట. కొన్నిసార్లు ఫోన్ హ్యాంగ్ కావడం, ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ అవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయని చెబుతున్నారు నిపుణులు.
  • వేసవిలో బయట ఉష్ణోగ్రతలు ఇప్పటికే అధికంగా ఉంటాయి. అలాంటి సమయంలో మొబైల్‌ను నేరుగా ఎండలో ఉంచితే ఫోన్ చాలా వేగంగా వేడెక్కిపోతుంది. ముఖ్యంగా బైక్‌పై ప్రయాణించే వారు ఫోన్‌ను సూర్యరశ్మి నేరుగా తగిలేలా ఉంచడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. అదేవిధంగా ఎక్కువసేపు వీడియోలు చూడటం లేదా హెవీ గేమ్స్ ఆడటం వల్ల CPU, GPU నిరంతరం పనిచేస్తూ అధిక వేడి ఉత్పత్తి చేస్తాయని చెబుతున్నారు.
  • ఇక మొబైల్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న యాప్స్ కూడా ఫోన్ హీటింగ్‌కు ప్రధాన కారణంగా మారుతున్నాయి. చాలామంది ఒకేసారి అనేక యాప్స్ ఓపెన్ చేసి వదిలేస్తుంటారు. అలా చేయడం వల్ల RAM, ప్రాసెసర్‌పై అదనపు ఒత్తిడి పెరుగుతుందట. అలాగే జీపీఎస్, బ్లూటూత్, వైఫై, మొబైల్ డేటా వంటి ఫీచర్లు ఎప్పుడూ ఆన్‌లో ఉంచడం వల్ల బ్యాటరీపై భారం పెరిగి ఫోన్ వేడెక్కుతుందని హెచ్చరిస్తున్నారు.
  • నకిలీ చార్జర్లు, నాణ్యతలేని USB కేబుళ్లు ఉపయోగించడం ప్రమాదకరమే. ఇవి సరైన విధంగా పవర్‌ను నియంత్రించలేకపోవడం వల్ల బ్యాటరీ అధికంగా వేడెక్కే అవకాశం ఉంటుంది. కొంతమంది చౌక ధరల కోసం లోకల్ చార్జర్లు వాడుతుంటారు. కానీ అవే భవిష్యత్తులో మొబైల్ దెబ్బతినడానికి కారణమవుతాయని టెక్నీషియన్లు.
మొబైల్ వేడేక్కకుండా పాటించాల్సిన జాగ్రత్తలు
  • మొబైల్‌ను వేడెక్కకుండా కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్‌ను ఎప్పుడూ నేరుగా ఎండలో ఉంచకూడదు. చార్జింగ్ సమయంలో గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం మానేయాలి. అవసరం లేని యాప్స్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో క్లోజ్ చేయాలి. ఒరిజినల్ చార్జర్, కేబుల్ మాత్రమే ఉపయోగించడం మంచిది. ఫోన్‌కు మందపాటి కవర్ ఉంటే కొంతసేపు తీసేయడం వల్ల వేడి తగ్గుతుంది.
  • అలాగే ఫోన్‌ను తరచూ రీస్టార్ట్ చేయడం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సమయానికి చేయడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది. చాలామంది మొబైల్ కవర్ వెనుక కరెన్సీ నోట్లు లేదా ఇతర వస్తువులు పెట్టుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఫోన్‌లో ఉత్పత్తి అయ్యే వేడి బయటకు వెళ్లకుండా అడ్డుకట్ట పడుతుంది. ముఖ్యంగా CPU భాగంలో వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుండటంతో ఫోన్ మరింత హీట్ అవుతుంది.

కాబట్టి ఈ ఎండాకాలంలో మొబైల్ వాడకంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్ బ్యాటరీ జీవితం పెరగడమే కాకుండా, ఖరీదైన రిపేర్ల నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>