Mobile Popup Ad
Mobile Popup Ad

రెండున్నరేళ్ల సమయం వృథా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) మండిపడ్డారు. 90 శాతం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టులో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విలువైన రెండున్నరేళ్ల సమయం వృథా చేసిందని ఫైర్ అయ్యారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి.. ఒక్కనాడు పాలమూరు ప్రాజెక్టుల మీద సమీక్ష చేయలేదని విమర్శించారు. కాలువల టెండర్లను రద్దు చేయడం, రెండన్నరేళ్లుగా తట్టెడు మట్టి ఎత్తకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నామని చెప్పారు.కేసీఆర్ మీద కక్షతో రైతులను మోసం చేయవద్దని, పాలమూరుకు అన్యాయం చేయవద్దని రేవంత్ కు ఎన్నో సార్లు సూచించామన్నారు. ఇప్పటికే పనులు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది నార్లాపూర్ తో పాటు ఏదుల, వట్టెం, కరివెనలో దాదాపు 45 టీఎంసీల వరకు నీటిని నింపుకునే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ప్రాజెక్టు పనులను పడావు పెట్టడం మీద త్వరలో నార్లాపూర్ నుండి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేయాలని ఈ నెల 15న బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ మేరకు మహబూబ్ నగర్ లో సమావేశమై మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యాచరణ ప్రకటించారని గుర్తు చేశారు. పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ ను తీసుకురావాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. రైతులు, ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించడంతో ప్రజల్లో వ్యతిరేకత తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం వచ్చిందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పాలమూరు ప్రాజెక్టుల మీద జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష చేపట్టారని అన్నారు.

సింగిరెడ్డి (Singireddy Niranjan Reddy) మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎత్తిపోతలలో పాడైన రెండు మోటార్లకు వెంటనే మరమ్మతులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొత్తం అయిదు మోటార్లు నడిచేలా చర్యలు చేపట్టాలన్నారు. నార్లాపూర్ – ఏదుల – వట్టెం మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి చేసి ఈ ఏడాది నీటిని ఎత్తిపోసుకుని రిజర్వాయర్లు నింపేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బీఆర్ఎస్ పోరుబాట నేపథ్యంలోనే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని విమర్శించారు. ప్రాజెక్టు పనులు చేపట్టే వరకు బీఆర్ఎస్ కార్యాచరణ ఆగదని… ప్రభుత్వ వైఫలాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.

Read Also: మహిళలు, పిల్లల భద్రతకు పోలీసుల కొత్త యాప్

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>