Mobile Popup Ad
Mobile Popup Ad

మద్యం రేట్ల పెంపుపై ఎక్సయిజ్ శాఖ ఎక్సర్‌సైజ్!

కలం, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పొదుపు పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర ఆదాయానికి వివిధ రూపాల్లో గండి పడింది. కమర్షియల్ సిలిండర్ రేటును భారీగా పెంచడంతో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్, హోటళ్లు, రెస్టారెంట్ల బిజినెస్ పడిపోయింది. ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీ, వ్యాట్ లాంటివి తగ్గిపోయాయి. వీటిని సర్దుబాటు చేసుకోడానికి వేర్వేరు రూపాల్లో ఆదాయ వనరులపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ఈ నెలాఖరుకల్లా తెలంగాణ (Telangana)లో భూముల విలువ పెరగనున్నది. దీంతో స్టాంప్ డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం పెరగనున్నది. మరోవైపు మద్యం ధరల (Alcohol Prices)ను పెంచడానికి స్టేట్ ఎక్సయిజ్ డిపార్టుమెంటు కసరత్తు మొదలుపెట్టింది. ప్రతిపాదనలు తయారుచేసింది. మద్యం కంపెనీలు సైతం రేట్లు పెంచాల్సిన అవసరంపై ప్రభుత్వానికి రిక్వెస్టులు పంపాయి. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాస్త ఆలస్యమైనా లిక్కర్, బీరు ధరలు పెరిగే అవకాశాలున్నాయి.

కమిటీ సిఫారసుల తర్వాతే నిర్ణయం :

ఇరాన్ యుద్ధ ప్రభావంతో గాజు తయారీకి అవసరమైన ఎల్పీజీ కొరత ఏర్పడిందని, ఎక్కువ ధరకు కొనాల్సి వస్తున్నదని, ఉత్పత్తి వ్యయం పెరిగినందున కనీసంగా 15% పెంచాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డిస్టిల్లరీలు, బ్రూవరీలు రిక్వెస్టులు పెట్టాయి. రేట్లు పెంచక తప్పదని స్పష్టం చేశాయి. కానీ రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మద్యం కంపెనీల విజ్ఞప్తులను పరిశీలించడానికి రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ప్రభుత్వం ఒక జుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ప్రభావాలను అంచనా వేసి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఈ నెల చివరకు లేదా వచ్చే నెలలలో రేట్లు పెరగొచ్చని వైన్ షాపుల యజమానులు భావిస్తున్నారు.

నెలకు రూ. 150 కోట్ల మేర ఖజానాకు ఆదాయం :

మద్యం ధరల పెంపుపై తెలంగాణ ఎక్సయిజ్ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. జ్యుడిషియల్ కమిటీ దాన్ని పరిశీలిస్తున్నది. రాష్ట్రంలో లిక్కర్ ధరలు పెరిగే అవకాశాలపై ఇప్పటికే ఎక్సయిజ్ శాఖ నుంచి లీకులు వస్తున్నాయి. సాధారణ బ్రాండ్లపై ఫుల్ బాటిల్‌కు కనీసంగా రూ. 60 పెరిగే అవకాశమున్నది. ప్రీమియం బ్రాండ్లకు రూ. 100, హై-ఎండ్ బ్రాండ్లకు రూ. 120 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉన్నది. మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం ఏకపక్షంగా పెంచాలనుకోవడంలేదు. దీనికి బదులు ధరల సవరణ (క్రమబద్ధీకరణ) పేరుతో సైజు, బ్రాండ్ కేటగిరీ ఆధారంగా ‘శ్లాబ్ సిస్టమ్’ పద్ధతిలో ధరలు పెంచే యోచనలో ఉన్నది. ధరల పెంపుతో ప్రభుత్వానికి నెలకు సుమారు రూ. 150 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా. గతేడాది మే నెలలో క్వార్టర్‌కు రూ.10 చొప్పున స్వల్పంగా ధరలు పెరిగాయి. ఇప్పుడు సమగ్ర సవరణకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నది.

ధరల క్రమబద్ధీకరణ చేసిన కర్ణాటక సర్కార్ :

కర్ణాటక ప్రభుత్వం మద్యం ధరల (Alcohol Prices) నియంత్రణను పూర్తిగా ఎత్తివేస్తూ శ్లాబులను తగ్గించింది. కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. పొరుగు రాష్ట్రాలకంటే ధరలు తక్కువగా ఉండేలా చూస్తూనే, ఆదాయాన్ని పెంచుకునేలా సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఇతర హామీల అమలుకు భారీగా నిధులు అవసరం అవుతున్నాయి. ఆదాయం పెంచుకోడానికి, మద్యం కంపెనీల డిమాండ్లను నెరవేర్చడానికి ఎక్సయిజ్ శాఖ సిఫారసుల మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. కర్ణాటక అనుసరిస్తున్న సరికొత్త పాలసీ తెలంగాణ ప్రభుత్వానికి ఒక కేస్ స్టడీగా మారనుంది. ఆ రాష్ట్రం తరహాలోనే ప్రభుత్వ నియంత్రణను తగ్గించి బ్రాండ్ల ధరల నిర్ణయాధికారాన్ని కంపెనీలకే వదిలేయడంపై తెలంగాణ ఎక్సయిజ్ శాఖ అధ్యయనం చేసి ప్రభుత్వానికి తెలియజేయనున్నది.

Read Also: పీఎం మోదీకి స్వీడన్ ప్రతిష్టాత్మక పురస్కారం

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>