కాంగ్రెస్‌లో కుంపటి.. ఎంపీ అర్వింద్ కామెంట్లతో కొత్త చర్చ !

కలం, తెలంగాణ బ్యూరో : “నాతో కలువు.. నిన్ను తీసుకెళ్లాల్సిన చోటి తీసుకెళ్తా..” అంటూ గత వారం ప్రధాని మోదీ కామెంట్లతో కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో, రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేకెత్తింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే బీజేపీ-కాంగ్రెస్ భాయీ.. భాయీ.. అంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తుండడంతో ప్రధాని కామెంట్లు బలం చేకూర్చినట్లయింది. ఆ వ్యవహారం సద్దుమణగముందే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) కొత్త వివాదాన్ని సృష్టించారు. “ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్య ఏం బంధమున్నదో.. వారిద్దరి మధ్య ఏమైనా లింక్ ఉన్నదేమో.. నాకైతే తెలియదు.. బీజేపీలో నేను చిన్న కార్యకర్తను…” అని కామెంట్ చేశారు. దీంతో అటు కాంగ్రెస్‌లో అనుమానాలకు, ఇటు విపక్షాల ఆరోపణలకు ఆజ్యం పోసినట్లయింది.

కాంగ్రెస్‌లో బీజేపీ ‘సైకలాజికల్ వార్’ గేమ్:

ఈటల రాజేందర్ బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నప్పుడే “త్వరలో బీజేపీలోకి వచ్చేస్తారు..” అంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఆయన మాటలే నిజమయ్యాయి. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిని పశ్చిమబెంగాల్‌లోని సువేందు అధికారితో పోల్చారు. తృణమూల్ కాంగ్రెస్‌లో కొనసాగుతూ మమతా బెనర్జీకి నమ్మినబంటుగా ఉండి చివరకు బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సైతం ఏదో ఒక రోజు బీజేపీలో చేరతాడనే కొత్త అనుమానాలను ఎంపీ అర్వింద్ సృష్టించారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే మంత్రుల మధ్య సరైన సఖ్యత లేదని, సమన్వయం లేదని ఆరోపణలు వస్తున్న సమయంలో సీఎంపై కామెంట్లు చేయడం ఆ పార్టీలో అలజడికి కారణమైంది. వ్యూహాత్మకంగానే ఈ కామెంట్లు చేసి కాంగ్రెస్‌లో కన్‌ఫ్యూజన్‌ను సృష్టించాలనుకున్నారా?.. మోదీ తరహాలోనే అర్వింద్ కూడా ఒక సైకలాజికల్ వార్ వ్యూహాన్ని అమలు చేశారా?.. సీఎంగా రేవంత్‌రెడ్డి ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనుకున్నారా?.. ఇవీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

అర్వింద్ కామెంట్లతో మంత్రుల మధ్య చిచ్చు :

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా నియమితులైనప్పుడే ఆయనపై అటు కాంగ్రెస్ నేతల్లో, ఇటు విపక్ష నేతల్లో విమర్శలు వచ్చాయి. ఒరిజినల్ కాంగ్రెస్ నేతకు పార్టీ పగ్గాలు అప్పజెప్పకుండా మరో పార్టీ నుంచి వచ్చినవారికి ఇవ్వడాన్ని తప్పుపడుతూ కామెంట్లు వెలువడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టడాన్ని కాంగ్రెస్ నేతలే జీర్ణించుకోలేకపోయారు. పలు సందర్భాల్లో ఏఐసీసీకి లేఖల పేరుతో ఫిర్యాదులు వెళ్ళాయి. కొద్దిమంది మంత్రుల్లోని ఆ అసంతృప్తిని బీజేపీ ఎంపీ ఆర్వింద్ రాజకీయంగా వాడుకున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదా దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు సీఎం బాధ్యతలు అప్పజెప్పి రేవంత్‌రెడ్డికి డిప్యూటీ సీఎం లాంటిది ఇస్తే సరిపోయేది.. అంటూ కొత్త వివాదానికి తెర లేపారు. ఇప్పటికే మంత్రుల మధ్య గ్యాప్ వచ్చిందనే నిందలున్న సమయంలో బీజేపీ ఎంపీ అర్వింద్ మైండ్ గేమ్ మొదలుపెట్టడం గమనార్హం.

సీఎంను ప్రొటెక్ట్ చేయని సహచర మంత్రులు :

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీజేపీ ఎంపీ కార్నర్ చేసినా తోటి మంత్రులు సైలెంట్‌గా ఉండిపోయారు. సీఎం ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మరి కొందరు కాంగ్రెస్ లీడర్లు అర్వింద్‌కు కౌంటర్ ఇచ్చినా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పందించకపోవడం పార్టీలోనే చర్చకు దారితీసింది. సీఎం పదవి నుంచి రేవంత్‌రెడ్డి తప్పుకుంటే బీజేపీలోకి రావాల్సిందిగా స్వయంగా తానే ఆహ్వానిస్తానని గతంలోనూ అర్వింద్ కామెంట్ చేశారు.

కాంగ్రెస్‌లో కుంపటి రాజేసిన అర్వింద్‌కు (Dharmapuri Arvind) స్వయంగా రేవంత్‌రెడ్డే సమాధానం చెప్పుకుంటారేమో.. మంత్రులు అలా స్పందిస్తారనే ఆశలేమీ లేవు.. అంటూ ఒక కాంగ్రెస్ నాయకుడు కామెంట్ చేయడం గమనార్హం. సీఎం రేవంత్‌రెడ్డిని రాజకీయంగా అస్థిరమైన నాయకుడుగా అర్వింద్ ప్రొజెక్ట్ చేసిన వ్యవహారం రానున్నరోజుల్లో మంత్రివర్గంలో మార్పులకు దారితీస్తుందా?.. శాఖల్లో మార్పు జరుగుతుందా?.. ఇకపైన ఏఐసీసీ ప్రోద్బలంతో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి కఠినంగా మారుతుందా?.. ఇలాంటివి ఆసక్తికరంగా మారాయి.

Read Also: ఎమ్మెల్యేలను కల్లాలకు కాపలా పెట్టండి.. కాంగ్రెస్‌పై RSP ఫైర్

Follow Us On: WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>