కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఎలక్షన్ కమిషన్ చేపడుతున్న ‘SIR’తో ఎన్ని ఓట్లు గల్లంతవుతాయి?.. ఎవరి ఓట్లు పోతాయి?.. ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో చాలామందికి రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో నివసిస్తున్నవారిని ఉద్దేశించి రెండు రోజుల క్రితం ఈ కామెంట్ చేశారు. సిటీ శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో సెటిలర్ ఓటర్లు చాలామంది ఉన్నారనేది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీల అభిప్రాయం. చాలామందికి అటు ఏపీలోనూ, తెలంగాణలోనూ ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ‘సర్’ చేపడుతుండడంతో సెటిలర్ ఓటర్ల పేర్లు మాత్రమే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాలోని ఓటర్లకు కూడా ఎన్నిచోట్ల పేరు ఉన్నదో బహిర్గతం కానున్నది. కొన్ని పార్టీలు ‘సెటిలర్’ అనే పదాన్ని వాడకుండా ఓటు బ్యాంకును ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి. ‘సర్’ ప్రక్రియలో (SIR Drive) భాగంగా ఎక్కడో ఒక చోట మాత్రమే కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. మరో చోట జాబితాలో పేరు డిలీట్ చేసుకోక తప్పదు.
సెటిలర్లలో తెలంగాణ ఓటర్లూ ఎక్కువే :
సెటిలర్ అనగానే తెలంగాణ ప్రజలకు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవారనే సాధారణ అభిప్రాయం గుర్తుకొస్తుంది. కానీ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు సైతం బతుకు దెరువు కోసమో లేక వివిధ కారణాలతోనో వచ్చి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారికి కూడా రెండు చోట్ల ఓట్లు ఉన్నాయనేది పార్టీలకు తెలియని విషయమేమీ కాదు. ‘సర్’ ప్రక్రియలో (SIR Drive) భాగంగా మ్యాపింగ్ పేరుతో బూత్ లెవల్ ఆఫీసర్లు చేపట్టిన ప్రీ-ఎక్సర్‌సైజ్‌లో డబుల్ ఎంట్రీ ఉన్న ఓటర్లు చాలామందే ఉన్నట్లు తేలింది. ఇంటింటికీ వెరిఫికేషన్ చేసి వివరాలను నమోదు చేసేటప్పుడు ఎక్కడెక్కడ జాబితాలో పేర్లు ఉన్నాయో వెల్లడవుతుందని, ఎక్కడ ఉంచుకోవాలనే అంశంలో ఓటర్లే నిర్ణయం తీసుకుంటారని, చివరకు ఒక చోట మాత్రమే ఉంటుందని, మిగిలిన చోట్ల డిలీట్ అవుతాయని స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సైతం వెల్లడించారు. దీంతో ఎన్ని డబుల్ ఎంట్రీలు, ట్రిపుల్ ఎంట్రీలు ఉన్నాయో అవన్నీ డిలీట్ అయ్యి చివరకు ఒకటి మాత్రమే కంటిన్యూ అవుతుంది.
అసెంబ్లీకంటే ఎంపీ ఎన్నికల్లో తక్కువ పోలింగ్ :
హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సిటీని ఆనుకుని ఉన్న మల్కాజిగిరి, చేవెళ్ళ సెగ్మెంట్లలో సెటిలర్ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. బీఆర్ఎస్ ఫస్ట్ టర్ములో ఐదేండ్లు పూర్తికాకుండా ఆరు నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం వెనక సెటిల్ ఓటర్ల అంశమే ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తెలంగాణకు, ఏపీకి కలిపి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి చెందిన సెటిలర్ ఓటర్లు ఓటు వేయడానికి అక్కడికే వెళ్తారన్నదే ఇందుకు కారణం. ఆ మేరకు ఓటు బ్యాంక్‌ను వదులుకునేకంటే ముందుగానే ఇక్కడ ఎన్నికలు జరిగితే ఆ సమస్య తలెత్తదు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్దిష్టంగా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతంకంటే పార్లమెంటు ఎన్నికల సమయంలో తక్కువ నమోదవుతున్నది. ఇందుకు కారణం పార్లమెంటు ఎన్నికలు జరిగే టైమ్‌లోనే ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగడం. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తుండడంతో ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీ తగ్గుతున్నది.
సిటీ శివారు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కువ :
నగరాన్ని ఆనుకుని ఉన్న శివారు నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్ తదితర నియోజకవర్గాల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ పర్సంటేజీని గమనిస్తే ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కో నియోజకవర్గంలో 7-8% తేడా ఉంటుండగా కొన్నిచోట్ల కనీసంగా 3% డిఫరెన్స్ ఉంటున్నది. ఈ కారణంగా పార్లమెంటు ఎన్నికల్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సంటేజీ 50% కంటే తక్కువ ఉంటున్నది. ‘సర్’ ప్రక్రియ (SIR Drive) ముగిసిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశమున్నది. రెండు లేదా ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్న ఓటర్లు ఇకపైన ఎక్కడో ఒక చోట మాత్రమే వినియోగించుకోవడం వీలవుతుంది. ఏపీ, తెలంగాణ సెటిలర్ ఓటర్ల పేర్లు జాబితా నుంచి డిలీట్ కావడంతో సంఖ్య కూడా తగ్గనున్నది. దాదాపు 20 లక్షల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. ‘సర్’ ప్రక్రియ (SIR Drive) మొత్తం పూర్తయిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది.
Read Also: బీజేపీలో కొత్త సంక్షోభం.. నేతలకు కీలక ఆదేశాలు!
Follow Us On: WhatsApp

