Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీలో కొత్త సంక్షోభం.. నేతలకు కీలక ఆదేశాలు!

కలం, తెలంగాణ బ్యూరో : బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం బీజేపీలో కొత్త సంక్షోభాన్ని (BJP Crisis) సృష్టించింది. ఈ కేసుపై ఎవ్వరూ మాట్లాడొద్దంటూ పార్టీ నేతల నుంచి ఓరల్ ఆర్డర్స్ జారీ అయ్యాయి. పార్టీ స్టేట్ చీఫ్ మినహా రాష్ట్రంలో మరే నేత ఇప్పటివరకు దీనిపై పెదవి విప్పలేదు. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ గురువారం జరగనున్నందున అప్పటివరకూ సైలెంట్‌గానే ఉండాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పటివరకు పార్టీ రాష్ట్ర స్థాయి నేతలెవరూ ఆయనను స్వయంగా పరామర్శించడానికి వెళ్లలేదు. ఆయన అనుచరులు, జిల్లా లీడర్లు మాత్రం ఆయనను ఓదార్చారు. ఓవైపు విపక్షాల నుంచి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి, మరోవైపు సొంత పార్టీలోనే రాష్ట్ర యూనిట్‌లో ఆయనతో విభేదించేవారి వ్యవహారం బండి సంజయ్‌ను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నది. మూడు రోజులుగా ఆయన ఒంటరయ్యారు.

జాతీయ నాయకత్వం తీసుకునే చర్యలపై ఉత్కంఠ :

తప్పు చేసింది బండి భగీరథ్ (Bandi Bhagirath) అయినా వ్యక్తిగతంగా బండి సంజయ్‌కు మచ్చగా మారింది. కేంద్ర హోం మంత్రిగా ఉండడంతో పార్టీలో కక్కలేని మింగలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటే విపక్షాలకు అస్త్రం దొరికినట్లవుతుందని, వారి ఆరోపణలను ధృవీకరించినట్లవుతుందన్నది ఒక వాదన. చర్యలు తీసుకోకుండా యధావిధిగా కేంద్ర మంత్రిగా కొనసాగిస్తే జాతీయ స్థాయిలో విపక్షాల నుంచి విమర్శల ఒత్తిడి పెరుగుతుందన్నది మరో వాదన. బండి భగీరథ్ పోక్సో వ్యవహారం కేవలం తెలంగాణకు పరిమితం కాదని, కేంద్ర హోం మంత్రిగా ఉన్నందున ఆ ప్రభావం జాతీయ స్థాయిలో ఉంటుందన్నది కేంద్ర నాయకత్వం భావన. దీంతో చర్యలు తీసుకోడానికి ముందూ వెనకా ఆలోచించాల్సి వస్తున్నదని రాష్ట్ర నేత ఒకరు వ్యాఖ్యానించారు.

సపోర్టు చేయలేక.. వ్యతిరేకంచలేక.. :

బండి భగీరధ్ పోక్సో వ్యవహారాన్ని బండి సంజయ్‌కు అంటగట్టడానికి వీల్లేదని స్వయంగా బీజేపీ స్టేట్ చీఫ్ వ్యాఖ్యానించారు. పార్టీని సంస్థాగతంగా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో బలోపేతం చేయడంలో బండి సంజయ్ పాత్రను తక్కువ చేసి చూడలేమని, శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ సభ్యత్వాన్ని పెంచారని, ప్రజల్లో ఒక పొలిటికల్ నెరేటివ్‌ను బిల్డప్ చేశారని బీజేపీ రాష్ట్ర నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఇప్పటికీ పార్టీలో ఆయన ఫాలోవర్స్ చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. “ఇప్పుడు ఆయనపై చర్య తీసుకుంటే ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు కేడర్‌లో చాలా మంది డిజప్పాయింట్ అవుతారు.. చర్యలు తీసుకోకుంటే పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ (BJP Crisis) తప్పదు.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆలోచించక తప్పదు..” అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అందుకే ఆయనకు అండగా ఉండలేక.. ఆయనను వ్యతిరేకించలేక.. విచిత్రమైన పరిస్థితి పార్టీలో నెలకొన్నదన్నారు.

Read Also: చిన్న మార్పులు, పెద్ద ఫలితాలు.. వయసు పెరిగినా చురుగ్గా ఉంచే ‘మైక్రో హాబిట్స్’

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>