కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రచారానికి పట్టుమని పది రోజులు కూడా లేదు. నామినేషన్ల ఉపసంహరణ ఫిబ్రవరి 3న ముగుస్తుండడంతో మరుసటి రోజు నుంచి మున్సిపాలిటీల్లో ప్రచారం హోరెత్తనున్నది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్నందున 9వ తేదీ సాయంత్రానికే క్యాంపెయిన్ క్లోజ్ అవుతుంది. దీంతో ఫిబ్రవరి 4-9 తేదీల మధ్య కేవలం ఆరు రోజులే ప్రచారానికి సమయం. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆరు రోజుల షెడ్యూలు ఖరారైంది. బీఆర్ఎస్ (BRS) సైతం ఇదే తరహాలో ప్రచారానికి ప్లాన్ చేసుకున్నది. ఇక బీజేపీ తరఫున ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay) ప్రచారంలో పాల్గొననున్నారు. బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ జిల్లాపైన ఫోకస్ పెట్టారు.
బీఆర్ఎస్‌కు ట్యాపింగ్ తలనొప్పి :
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) ఎంక్వయిరీలతో ఎప్పుడు ఎవరికి నోటీసు వస్తుందో తెలియని గందరగోళం బీఆర్ఎస్ నేతల్లో నెలకొన్నది. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరైన హరీశ్‌రావు (Harish Rao), కేటీఆర్‌లను (KTR) “అవసరమైతే మళ్ళీ పిలుస్తాం.. రావాల్సి ఉంటుంది..” అని సిట్ (SIT) చెప్పడంతో ఏ రోజు నోటీసు వచ్చినా శ్రేణుల అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. ఫలితంగా అది అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపుతుందనేది ఆ పార్టీ నేతల భావన. కేసీఆర్‌ను సైతం నోటీసులిచ్చి విచారిస్తారనే ఊహాగానాలు రావడంతో ఆయన హాజరయ్యే రోజున జిల్లాల నుంచి పార్టీ శ్రేణులన్నీ తరలివస్తే మున్సిపాలిటీల్లో ఆ మేరకు ప్రచారం వీక్ అవుతుందని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలను మించిపోయేలా మున్సిపాలిటీలను కైవశం చేసుకోవాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. కానీ ఫోన్ ట్యాపింగ్ ఆ పార్టీ అగ్ర నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
ఆల్టర్నేట్‌గా ఇన్‌చార్జిల సెటప్ :
మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సమయంలో ఇలాంటి చిక్కులొస్తాయని బీఆర్ఎస్ ఊహించకపోయినా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరిని ఇన్‌చార్జిలుగా నియమించింది. కాంగ్రెస్ పార్టీ ప్రతీ పార్లమెంటు సెగ్మెంట్‌కు ఒకరు చొప్పున మంత్రులకు బాధ్యతలు అప్పజెప్తే బీఆర్ఎస్ మాత్రం అసెంబ్లీ స్థానాలను యూనిట్‌గా తీసుకున్నది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు అభ్యర్థులకు ఖర్చు పెట్టడంలో వెనకాడుతుండడం, పార్టీ నుంచి ఆర్థిక సాయం అందకపోవడంతో విజయావకాశాలపై ప్రభావం పడుతుందని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయడానికి ఇన్‌చార్జిల సెటప్‌ను ఎంచుకున్నది. కేటీఆర్, హరీశ్‌రావు తదితరులు ప్రచారానికి హాజరుకావడంలో ఇబ్బందులున్నా జిల్లా, రాష్ట్ర నేతల సమన్వయంతో ఇన్‌చార్జిలు చొరవ తీసుకునేలా ఈ ఆల్టర్నేట్ మెకానిజంను బీఆర్ఎస్ రూపొందించుకున్నది.
Read Also: ఆదాయంలో మూడో వంతు అప్పులే.. 9 నెలల్లో రూ. 66 వేల కోట్లు
Follow Us On: Instagram


