కలం, తెలంగాణ బ్యూరో : అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ వరుస ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. పార్లమెంటు స్థానాలనే కాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లనూ కోల్పోతున్నది. దీనికి తోడు కేసులు వెంటాడుతుండడంతో పదేండ్ల పాలనలోని ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. ఇంతకాలం విపక్షాలే విమర్శలు చేస్తే ఈ మధ్య కుటుంబ సభ్యురాలైన కవిత కూడా లేవనెత్తే అంశాలూ ఆ పార్టీని (BRS Cadre) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కేసీఆర్, ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీశ్‌రావు విచారణను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు తాజాగా కేసీఆర్ సమీప బంధువైన రమ్యారావు సైతం ఈడీ జాయింట్ డైరెక్టర్‌ను ఆశ్రయించి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌పై ఆరోపణలతో పాటు కొన్ని ఆధారాలను సమర్పించారు. ఏదో ఒక రూపంలో కేసీఆర్ ఫ్యామిలీ, ఆయనకు దగ్గరి మనుషులు వివిధ రకాల ఆరోపణల్లో కూరుకుపోయారు.
కేసీఆర్‌కు కాళేశ్వరం పరేషాన్ :
కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram) అవినీతి జరిగిందని, అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణకు కేసీఆర్ హాజరై తన వివరణ ఇచ్చారు. అనంతరం జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ఆమోదించినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఏ సమయంలో ఎలాంటి పరిణామం చోటుచేసుకుంటుందోననే అనుమానం బీఆర్ఎస్ నేతల్లో నెలకొన్నది. కేసీఆర్, హరీశ్‌రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి తదితరులపై తదుపరి విచారణ జరిగేంతవరకు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దంటూ రెండు రోజుల క్రితం ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆంక్షలన్నీ తొలగిపోయిన తర్వాత కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పట్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆందోళన బీఆర్ఎస్ కేడర్‌ను (BRS Cadre) వెంటాడుతూ ఉంది.
ఈ-కార్ రేసులో నిందితుడిగా కేటీఆర్ :
ఫార్ములా కార్ రేసు (Formula E Race) కేటీఆర్‌ను ఇప్పటికే వెంటాడుతూ ఉన్నది. ఒకవైపు సిట్ (SIT) దర్యాప్తు, ఇంకోవైపు మనీ లాండరింగ్ ఆరోపణలతో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ కేసును విచారిస్తూ ఉన్నాయి. ఇప్పటికే సిట్ ముందు నాలుగుసార్లు హాజరైన కేటీఆర్ ఇటీవలే ఈడీ ముందు హాజరయ్యారు. విదేశీ మారకం రూపంలో ఈవెంట్ ఆర్గనైజర్‌కు పేమెంట్ జరగడం, నిబంధనలను ఉల్లంఘించడం, అధికార దుర్వినియోగానికి పాల్పడడం.. ఇలాంటి అభియోగాలను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. దీన్ని కేటీఆర్ ఒక ‘లొట్టపీసు కేసు’ అని పైకి చెప్తున్నా ఏ సమయంలో అరెస్టవుతారోననే ఆందోళన ఆయన అనుచరుల్లో, అభిమానుల్లో నెలకొన్నది. కానీ ఆ కేసు లైవ్‌లోనే ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గందరగోళం కనిపిస్తున్నది.
అనూహ్యంగా ఫోన్ ట్యాపింగ్‌లో హరీశ్ :
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు పేరు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో ఉండడంతో పాటు అనూహ్యమైన తీరులో ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. న్యాయస్థానాల నుంచి క్లీన్ చిట్ ఉందన్న భరోసా ఆయన అనుచరుల్లో కనిపించినా తాజాగా ఆయనను సిట్ విచారణకు పిలవడం సరికొత్త గందరగోళానికి కారణమైంది. పోలీసుల నోటీసు ప్రకారం విచారణకు హాజరైనా ఆ కేసు ముగింపు దశకు చేరుకునే నాటికి ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎలాంటి ఊహించని పరిణామాలను చవిచూడాల్సి వస్తుందోననే ఆందోళన ఆయన అభిమానుల్లో, అనుచరుల్లో వ్యక్తమవుతున్నది. కేసీఆర్‌తో పాటు ఆయనకు సన్నిహితంగా ఉన్న కేటీఆర్, హరీశ్‌రావులు వేర్వేరు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటుండడంతో మొత్తంగానే పార్టీ కేడర్‌లో రకరకాల అభిప్రాయాలు నెలకొన్నాయి.
కవిత కామెంట్ వెంటనే సిట్ ఏర్పాటు :
ఇంటి అల్లుడి ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేస్తారా అంటూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఇటీవల సీరియస్ కామెంట్లు చేశారు. కౌన్సిల్ సమావేశాల్లో ఆమె తన చివరి రోజున ఉద్వేగభరితంగా కంటి తడి పెట్టుకుని చేసిన కామెంట్ల అనంతరం ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది. నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో మొత్తం ఎనిమిది మందితో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడడంతో ఏదో ఒక సంచలనం జరుగుతుందన్న ఊహాగానాలు వినిపించాయి. హరీశ్‌రావుపై నిప్పులు చెరుగుతున్న సమయంలో ఆయనను ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు విచారణకు పిలవడం, కవిత కామెంట్లను జోడించుకుని అటు బీఆర్ఎస్, ఇటు జాగృతి కార్యకర్తల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కవిత కామెంట్ల నేపథ్యంలో మున్ముందు ఆమెను కూడా విచారణకు పిలిచి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఏ ఆధారాలతో వ్యాఖ్యలు చేశారో వాటిని ఇవ్వాల్సిందిగా కోరడంతో పాటు ఆమె వివరణ తీసుకునే అవకాశమున్నది.
Read Also: సిట్ విచారణలో అధికారులు చేసిందిదే: హరీశ్ రావు
Follow Us On: X(Twitter)


