కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో భారత్ ఘన విజయం సాధించిన తర్వాత జరిగిన వేడుకల్లో టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) జాతీయ జెండాను అవమానించారంటూ పుణే పోలీసులకు ఫిర్యాదు అందింది. అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం పాండ్యా జాతీయ జెండాను తన శరీరంపై చుట్టుకొని, అసభ్యంగా ప్రవర్తించారని వాజిద్ ఖాన్ అనే న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ పతాక గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని శివాజీ నగర్ పోలీసులను కోరారు. భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవడం పట్ల హార్దిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేశారు. గతంలో తాను పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని, ఇది భారత క్రికెట్ ఆధిపత్యానికి ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

