కలం, వెబ్ డెస్క్: ‘నా 40 ఏళ్ల రాజకీయ జీవితంపై మచ్చ పడింది.. నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆవేదన వ్యక్తం చేశారు. నైనీ బొగ్గు బ్లాక్ (Naini Coal Block) టెండర్లపై వస్తున్న ఆరోపణలపై భట్టి విక్రమార్క శనివారం ప్రజా భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై వాస్తవాలను గమనించి రాధాకృష్ణ తప్పుడు రాతలు రాసినట్లు బహిరంగంగా ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. నిజానిజాలను తిరిగి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ విషయంలో చేసిన తప్పులను వివరిస్తూ మళ్లీ వాస్తవాలను ప్రచురించాలని చెప్పారు.
సదరు కథనంతో తన 40 ఏళ్ల రాజకీయ జీవితంపైనే మచ్చ పడిందని భట్టి అన్నారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని, తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితం సుదీర్ఘ ప్రయాణం అని, ఒక్క రోజుతో ఇదంతా సాధ్యపడలేదని తెలిపారు. ఎన్నో కష్టనష్టాలు, వ్యయ ప్రయాసలు, ఒత్తిళ్లను తట్టుకొని రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగానన్నారు. ఎంతో ఉన్నత లక్ష్యం, సంకల్పం కోసం రాజకీయాల్లోకి వచ్చానని, చిల్లర పనులు, వ్యక్తిగత కార్యకలాపాల కోసం రాలేదని వెల్లడించారు. తనకు ఎంతో ఉన్నతమైన ఆలోచనలు, భావాలు ఉన్నాయని, వాటిని అమలు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తాను పోగేసుకున్న వ్యక్తిత్వాన్ని ఒక్క రోజు, ఒక్క కథనంలో రాస్తే సరిపోదని భట్టి అన్నారు. సదరు కథనంలో పేర్కొన్న సైట్ విజిట్ ప్రస్తావనపై భట్టి (Bhatti Vikramarka) స్పందించారు. టెండర్ సబ్‌మిట్ చేసే తేదీయే ఇంకా రాలేదని, ఇక సైట్ విజిట్ ప్రస్తావన ఇప్పుడే ఎందుకు వస్తుంది? అని ప్రశ్నించారు. సవరణ నోటిఫికేషన్ ప్రాసెస్ రాకముందు సైట్ విజిట్ ఉండదని తెలిపారు. ఆ ప్రక్రియ మొదలు కాకముందే కథనం వచ్చిందని, రాధాకృష్ణ ఏదేదో ఊహించుకొని అడ్డగోలు కథనాలు రాశారని మండిపడ్డారు. రాసినదాన్ని పొరపాటుగా అని అంగీకరించి, సదరు పత్రిక వాస్తవాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: నేను చెప్పినట్లుగానే కేంద్రం చేసింది : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
Follow Us On: Pinterest


