కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్ (Excise Enforcement Office) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన వ్యవహారంలో నిందితులను వెంటనే పట్టుకొని చర్యలు తీసుకోవాలని అధికారుల వేధింపులు పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు సిబ్బంది కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. “వీ వాంట్ జస్టిస్” (We Want Justice) అంటూ నినాదాలు చేశారు. అధికారులు వచ్చి సముదాయించినా ఆందోళన కొనసాగించారు. కొందరు అధికారులు పేరు కోసం స్వప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాలు జిల్లాల గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని దాడులు చేస్తున్నారని అలాంటి పరిస్థితుల్లో సిబ్బంది బలి అవుతున్నామని తీవ్ర ఆరోపణలు చేశారు. వెంటనే సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ మల్లారెడ్డి (Mallareddy) ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. మీ డిమాండ్లు సమస్యలు చర్చిద్దామని తన ఛాంబర్‌కు ఆహ్వానించారు. దీంతో ఎక్సైజ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు రవి ఆధ్వర్యంలో ఆందోళనకారుల ప్రతినిధుల బృందం డిసి (Deputy Commissioner) వద్దకు వెళ్ళి సమస్యలు చర్చించారు. కొందరు అధికారులు వేధింపులు ఆపాలని సిబ్బందికి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కానిస్టేబుల్ సౌమ్య కుటుంబాన్ని ఆదుకోవాలని తమ డిమాండ్‌లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎక్సైజ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు రవి కలంతో చెప్పారు. తప్పుడు కేసులు స్మగ్లర్ల తో సంబంధాలు కిందిస్థాయి సిబ్బందిపై వేధింపులు పని ఒత్తిడి లాంటి విషయాలపై ప్రధానంగా ఆందోళనకారులు గళమెత్తారు.
ప్రాణాపాయ స్థితిలోనే కానిస్టేబుల్ సౌమ్య
గంజాయి ముఠాను నిలువరించే క్రమంలో ముఠా సభ్యులు కారుతో మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టారు. ఎక్సైజ్ పోలీసులు నగర శివారులోని మాధవనగర్ వద్ద గంజాయి ముఠాను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారు వద్దకు వెళ్లగా నిర్మల్‌కు చెందిన గంజాయి ముఠా సభ్యులు కారుతో ఢీకొట్టారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు గంజాయి ముఠా సభ్యులు మహమ్మద్ సొఫియొద్దీన్, సయ్యద్ షోయల్‌లను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే సౌమ్యపై నుంచి కారు వెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆరోగ్య పరిస్తితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.


