కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఇంటిపై ఈ దాడికి యత్నించారు.
అంబటి ప్రెస్ మీట్ ముగిసిన అనంతరం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆందోళనకారులు గుంటూరులోని అంబటి రాంబాబు నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిరసనకారులు కర్రలతో ఇంటిపై, ఆవరణలో ఉన్న అంబటి కారుపై దాడి చేశారు. దాడి ధాటికి కారు అద్దాలు ధ్వంసం కావడమే కాకుండా, ఇంట్లోని ఫర్నీచర్ కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆందోళనకారులు అంబటి నివాసంపై కోడిగుడ్లతో దాడి చేస్తూ నినాదాలు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో అంబటి రాంబాబు (Ambati Rambabu) తన ఇంట్లోనే ఉండటం గమనార్హం.
సమాచారం అందుకున్న గుంటూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు నివాసం చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించి నిరసనకారులను చెదరగొట్టారు. మరోవైపు, అంబటి రాంబాబుపై ముఖ్యమంత్రిని దూషించినందుకు గాను పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.


