కలం, డెస్క్ : సిట్ విచారణాధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ పి.వెంకటగిరికి మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరు పేజీల లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలంటూ సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసులను నందినగర్ (Nandi Nagar) లోని కేసీఆర్ ఇంటి గోడలకు అతికించారు సిట్ అధికారులు. ఈ విషయంపై కేసీఆర్ లేఖ రాసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వలేదని.. ఇంటిగోడలకు నోటీసులు అంటించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు కేసీఆర్. అలా అంటించమని చట్టంలో ఎక్కడాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల తీరు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉందని బీఆర్ ఎస్ అధినేత చెప్పారు.
‘ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ పరిధిలో లేను. గత కొన్ని రోజులుగా కరస్పాండెంట్ అడ్రస్ గా నందినగర్ పెట్టుకున్నాను. రెండేళ్లుగా నేను ఎర్రవల్లి (Erravalli Farmhouse) పరిధిలోనే ఉంటున్నాను. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారు నివసిస్తున్న చోటే విచారించమని చట్టం చెబుతోంది. జూబ్లీహిల్స్ పరిధిలో విచారించే అధికార పరిధి సిట్ అధికారులకు లేదు. నోటీసుల జారీ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలను సిట్ అధికారులు ఉల్లంఘించారు. సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసు విషయంలో జరిగింది గుర్తుంచుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్.
ఎన్నికల అఫిడవిట్ లో తన అడ్రస్ తో సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదని కేసీఆర్ తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు అఫిడవిట్ లో తన నివాసం సిద్దిపేటలో అని ఇచ్చారని.. కానీ ఆయన్ను హైదరాబాద్ లో ఎందుకు విచారించారంటూ ప్రశ్నించారు బీఆర్ ఎస్ అధినేత. ఈ విషయంలో పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని.. పోలీసులు వ్యవహరించిన తీరు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు మాజీ సీఎం కేసీఆర్. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని కానీ బాధ్యత గల పౌరుడిగా ఫిబ్రవరి 1న నందినగర్ లో విచారణకు సహకరిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఎలాంటి నోటీసులైనా ఎర్రవల్లిలోని అడ్రస్ కే పంపాలని పోలీసులకు కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టులోని ‘వీడీ మూర్తి’ కేసు తీర్పును కేసీఆర్ లేఖలో ప్రస్తావించారు. చట్ట పరమైన అంశాలు ఎలా ఉన్నా సరే.. పోలీసులు నందినగర్ లోనే విచారించాలని పట్టుబట్టినందున అక్కడే స్టేట్ మెంట్ రికార్డు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ (KCR) చెప్పారు.
Read Also: మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం
Follow Us On: X(Twitter)


