కలం, వెబ్ డెస్క్: కల్తీ పాలు.. కల్తీ టీ పౌడర్.. కల్తీ చికెన్.. కల్తీ అల్లం పేస్ట్.. రాష్ట్ర ప్రజలను ఇటీవల భయభ్రాంతులకు గురి చేసిన కల్తీ ఆహార పదార్థాలివి. తాజాగా మరో కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ (Hyderabad)లో భారీ ఎత్తున తయారవుతున్న కల్తీ పనీర్, కోవా, క్రీమ్, నెయ్యిని అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ సమీపంలో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. మొత్తం 6 హోల్‌సేల్, రిటైల్ షాపులపై దాడులు చేయగా భారీ ఎత్తున కల్తీ పనీర్, కల్తీ కోవా, కల్తీ క్రీమ్, కల్తీ నెయ్యిని గుర్తించారు. మొత్తం 3,892 కిలోల డెయిరీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. నాసిరకం పనీర్‌ను కిలోకు సుమారు రూ.280కి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నగరంలోని హోటల్స్, క్యాటరింగ్ సర్వీసులకు దీన్ని భారీ ఎత్తున సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పదార్థాలను ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు, ఇంకా దీని వెనుక ఎంతమంది ఉన్నారన్న దానిపై విచారణ చేపట్టారు.

