కలం, తెలంగాణ బ్యూరో : క్రీడాకారులను ప్రోత్సహించేలా ఇప్పటికే పలు రూపాల్లో ఇన్సెంటివ్స్ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నది. పారా అథ్లెట్లకు (Para Athletes) వారి సొంత జిల్లాల్లో నివాస వసతి కల్పించాలనుకుంటున్నది. ఇందుకోసం ఇంటి స్థలాలను ఇవ్వాలని భావిస్తున్నది. దీనికి అవసరమైన నిధులను రానున్న వార్షిక బడ్జెట్‌లో (Telangana Budget) కేటాయించనున్నది. రాష్ట్రంలో సుమారు 300 మందికి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి కలగనున్నట్లు అంచనా. పారా అథ్లెట్లకు 150-200 చ.గ. ఇంటి స్థలాన్ని ఇవ్వాలనుకుంటున్నది. దీనికి సంబంధించిన విధివిధానాలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఖరారు చేయనున్నది. ఒలింపిక్స్ పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలని క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం పారా అథ్లెట్లను సైతం విస్మరించకూడదన్న నిర్ణయంలో భాగంగా ఇలాంటి ఇన్సెంటివ్‌కు శ్రీకారం చుడుతున్నది.
స్పోర్ట్స్ పాలసీకి కొనసాగింపుగా… :
క్రీడాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పోర్ట్స్ పాలసీని ప్రకటించింది. ఒలింపిక్స్, ఏషియన్, కామన్‌వెల్త్.. ఇలా వివిధ స్థాయిల్లోని పోటీల్లో అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున నగదు పారితోషికంతో పాటు గౌరవ ఉద్యోగం, ఇంటి స్థలం.. ఇలాంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నది. దీన్ని పారా అథ్లెట్లకు (Para Athletes) కూడా వర్తింపజేయనున్నది. ఒలింపిక్ (పారాలింపిక్స్) గోల్డ్ అవార్డుకు రూ. 6 కోట్లు, సిల్వర్‌కు రూ. 4 కోట్లు, బ్రాంజ్‌కు రూ. 2.50 కోట్లు, పార్టిసిపేషన్ అవార్డుగా రూ. 15 లక్షల చొప్పున ఇస్తున్నది. ఏషియన్ (పారా ఏషియన్) గేమ్స్ విజేతల్లో గోల్డ్ మెడల్‌కు రూ. 3 కోట్లు, సిల్వర్‌కు రూ. 1.50 కోటి, బ్రాంజ్‌కు రూ. 75 లక్షలు, పార్టిసిపేషన్‌కు రూ. 7.50 లక్షల చొప్పున ఇస్తున్నది. కామన్‌వెల్త్ గేమ్స్ లో గోల్డ్ కు రూ. 1.50 కోట్లు, సిల్వర్‌కు రూ. 75 లక్షలు, బ్రాంజ్‌కు రూ. 50 లక్షలు, పార్టిసిపేషన్‌కు రూ. 15 లక్షల చొప్పున ఇస్తున్నది. పారా అథ్లెట్లకు కూడా ఇకపైన ఇది కొనసాగేలా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరగనున్నది.
Read Also: 2029లో బీఆర్‌ఎస్ ఎలా గెలుస్తుందో చూస్తా : సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

