కలం, స్పోర్ట్స్ : ఎమిరేట్స్ స్టేడియంలో ఆదివారం రాత్రిప్రీమియర్ లీగ్ (Premier League) టైటిల్ పోరు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆర్సెనల్ ఆశలకు గట్టి దెబ్బ ఇస్తూ మాంచెస్టర్ యునైటెడ్ (Arsenal vs Manchester United) 3-2తో సంచలన విజయం సాధించింది. ముగింపుకు మూడు నిమిషాల ముందు మాథియస్ కున్హా కొట్టిన అద్భుత గోల్ ఈ మ్యాచ్‌ను పూర్తిగా తలకిందులు చేసింది. 29వ నిమిషంలో లిసాండ్రో మార్టినెజ్ చేసిన పొరపాటు ఆర్సెనల్‌కు లీడ్ ఇచ్చింది. ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. 37వ నిమిషంలో జుబిమెండీ చేసిన తేలికపాటి బ్యాక్‌పాస్‌ను బ్రయాన్ ఎంబ్యూమో చాకచక్యంగా ఉపయోగించుకుని స్కోరు సమం చేశాడు.
రెండో అర్ధభాగం మొదలైన కొద్దిసేపటికే ప్యాట్రిక్ డోర్గు 20 గజాల దూరం నుంచి బలమైన షాట్‌తో యునైటెడ్‌ను ముందుకు నడిపించాడు. ఎమిరేట్స్ ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగింది. ఆర్సెనల్ మాత్రం చివరి వరకు పోరాడింది. 84వ నిమిషంలో సాకా కార్నర్ నుంచి మికెల్ మెరినో గోల్ సాధించాడు. కనీసం డ్రా అయినా దక్కుతుందన్న ఆశ మెరిసింది.అయితే 87వ నిమిషంలో ఆ ఆశలను కున్హా చిదిమేశాడు. బ్రూనో ఫెర్నాండెజ్ ఇచ్చిన పాస్‌పై 25 గజాల దూరం నుంచి కొట్టిన షాట్ రాయాను మట్టికరిపించి నెట్‌ను తాకింది. ఎమిరేట్స్‌లో షాక్ వాతావరణం నెలకొంది.
ఈ ఓటమితో ఆర్సెనల్ 13 మ్యాచ్‌ల అజేయ పరంపరకు ముగింపు పలికింది. వరుసగా 18 మ్యాచ్‌లుగా కొనసాగిన అజేయ రికార్డు కూడా ముగిసింది. సిటీ, అస్టన్ విల్లా కేవలం నాలుగు పాయింట్ల దూరంలోకి వచ్చాయి. ప్రీమియర్ లీగ్ (Premier League) టైటిల్ పోరు మళ్లీ ఉత్కంఠగా మారింది. ఇక మైకల్ క్యారిక్ హయాంలో యునైటెడ్ మరో భారీ విజయం నమోదు చేసింది. సిటీ తరువాత లీగ్ లీడర్‌ను కూడా ఓడించి నాలుగో స్థానానికి ఎగబాకింది. టైటిల్ రేస్ ఇప్పుడు పూర్తిగా ఓపెన్ అయింది.
Read Also: ‘అందులో సగం ఇవ్వండి మేమేంటో చూపిస్తాం’
Follow Us On : WhatsApp


