Mobile Popup Ad
Mobile Popup Ad

ఎల్పీజీ కష్టాలకు చెక్.. ఆల్టర్నేట్‌గా డీఎంఈ..

కలం, తెలంగాణ బ్యూరో : ఇరాన్‌లో యుద్ధం కారణంగా తలెత్తిన ఎల్పీజీ సంక్షోభాన్ని అధిగమించేందుకు పెట్రోలియం మంత్రిత్వశాఖ ప్రత్యామ్నయాన్ని (LPG Alternative) సిద్ధం చేస్తున్నది. ఇక ఎల్పీజీ అవసరమే లేకుండా వంట అవసరాలను తీర్చడంపై ఫోకస్ పెట్టింది. పైలట్ ప్రాజెక్టుగా చేసిన కసరత్తు ఆశించిన ఫలితాలనే ఇచ్చింది. దీన్ని మరింత విస్తరించడం ద్వారా ఎల్పీజీకి పూర్తి స్థాయిలో ఆల్టర్నేట్‌గా వాడుకునేలా ప్లాన్ చేస్తున్నది. సీఎస్ఐఆర్ (CSIR) పరిశోధనలతో పెట్రోలియం ఉత్పత్తుల కోసం విదేశాల మీద ఆధారపడే అవసరం ఉండదని, సొంతంగా దేశంలోనే ఇంధన అవసరాలను తీర్చుకోవచ్చన్నది సీఎస్ఐఆర్ ఇస్తున్న భరోసా. ఇంతకీ ఆ ఆల్టర్నేట్ ఇంధనం ఏంటో తెలుసా? డై ఇథైల్ ఈథర్ (DME). దీన్ని బొగ్గు, కార్బన్ డై ఆక్సైడ్, బయోమాస్ తదితరాల నుంచి ఉత్పత్తి చేసుకోవచ్చని, ఎల్పీజీ తరహాలోనే ఇది కూడా క్లీన్ ఎనర్జీ అని స్పష్టత ఇచ్చింది.

మిథనాల్‌తో తయారయ్యే కృత్రిమ ఇంధనం :

గల్ఫ్ దేశాల్లో తరచూ తలెత్తుతున్న అశాంతి పరిస్థితులు, ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం, ముడి చమురుపై పడుతున్న ప్రభావం, విదేశాలపై ఆధారపడే అవసరాన్ని తగ్గించుకోవాలన్న ఆలోచనతో ప్రత్యామ్నాయంగా డీఎంఈ పరిశోధనలపై కేంద్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా దృష్టి పెట్టింది. తాజాగా ఇరాన్‌లో సంక్షోభంతో ఒక అడుగు ముందుకు పడినట్లయింది. మిథనాల్ అనే ఆర్గానిక్ రసాయనం నుంచి డీఎంఈ ఒక కృత్రిమ వాయువుగా తయారవుతుంది. లక్షణాలన్నీ ఎల్పీజీని పోలి ఉంటాయి. అందుకే దీన్ని ‘క్లీన్ ఆల్టర్నేటివ్’ అని సీఎస్ఐఆర్ స్పష్టత ఇచ్చింది. దీన్ని తయారు చేయడానికి లేదా సిలిండర్లలో ఫిల్లింగ్ చేయడానికి ఒక మేరకు మాత్రమే కొత్త టెక్నికల్, మెకానికల్ ఉపకరణాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది తప్ప మేజర్‌గా పెట్టుబడి పెట్టే ప్లాంట్‌ల అవసరం లేదని పేర్కొన్నది. ఇప్పుడు ఎల్పీజీ ఫిల్లింగ్ కోసం వాడుతున్న ఎక్విప్‌మెంట్‌కు స్వల్ప మార్పులు చేసి డీఎంఈని ఉత్పత్తి చేసుకోవచ్చని పేర్కొన్నది.

విదేశాలపై ఆధారపడే అవసరం ఉండదు :

బొగ్గు, బయో మాస్, కార్బన్ డై ఆక్సైడ్ నుంచి ఉత్పత్తి చేసే డీఎంఈ విస్తృతంగా వినియోగంలోకి వస్తే ఎల్పీజీ అవసరాల కోసం ఇకపైన విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదన్నది సీఎస్ఐఆర్ వాదన. విదేశీ మార్కెట్‌లకు బదులుగా సొంత మార్కెట్‌లోనే డీఎంఈని అందుబాటులోకి తేవచ్చన్నది. క్రూడాయిల్, ఎల్పీజీ ధరల హెచ్చుతగ్గులు, విదేశీ మారక ద్రవ్యంపై పడే ప్రభావం.. వీటి నుంచి బయటపడవచ్చని తెలిపింది. ఇప్పుడు వాడుతున్న ఎల్పీజీ సిలిండర్లనుగానీ, పైప్‌లనుగానీ, గ్యాస్ స్టవ్‌లనుగానీ మార్చాల్సిన అవసరమే లేదని వివరించింది. ఎల్పీజీతో కలిపి బ్లెండింగ్ చేసి డైరెక్టుగా డీఎంఈని వాడుకోచ్చని, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కూడా నిర్దిష్ట ప్రమాణాలను ఫైనల్ చేసిందని తెలిపింది.

పైలట్ ప్రాజెక్టు ద్వారా ఆశించిన ఫలితాలు :

పూణెలోని సీఎస్ఐఆర్, నేషనల్ కెమికల్ లేబోరేటరీ (NCL) సైంటిస్టులు డీఎంఈ తయారీ కోసం ఒక పైలట్ ప్లాంట్‌ను నెలకొల్పారు. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా (LPG Alternative) సొంత వనరులపై ఆధారపడే ఇంధనాన్ని తయారుచేయడంపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు. ఎల్పీజీ లక్షణాలు, దానిలోని సౌకర్యం, క్లీన్ ఎనర్జీ ప్రమాణాలు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని స్వదేశీ ఇంధనాన్ని ఉత్పత్తి చేయడంపై ల్యాబ్ ద్వారా చేసిన రీసెర్చ్ మంచి ఫలితాలు ఇచ్చినట్లు తెలిసింది. పైలట్ ప్లాంట్‌లో అనుకున్నవన్నీ మంచి రిజల్టు ఇవ్వడంతో ఇప్పుడు భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భవిష్యత్తులో ఎల్పీజీ కొరత ఏర్పడినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలగకుండా డీఎంఈ ద్వారా అవసరాలను తీర్చుకోవచ్చన్న భరోసాను సైంటిస్టులు వ్యక్తం చేశారు.

Read Also: ఇండియాలో భారీ స్థాయిలో ఉద్యోగులను తీసేస్తున్న మెటా..

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>