కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల సాగు, తాగు నీటితో పాటు విద్యుత్ అవసరాలకు గుండెకాయ లాంటి శ్రీశైలం రిజర్వాయర్ ఉనికి ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. డ్యామ్ దిగువన ఉన్న ప్లంజు ఫుల్ (భారీ గొయ్యి) ముప్పుపై గత కొన్నేళ్లుగా కేంద్ర జల సంఘం (CWC), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నిపుణులు, స్టడీ కమిటీలు హెచ్చరిస్తున్నా కానీ, శాశ్వత చర్యలు చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. 2002లో చేసిన కాంక్రీట్ పనులు, 2009 అక్టోబర్ లో వచ్చిన భారీ వరదల కారణంగా డ్యామ్ పైనుంచి నీరు దూకే చోట (స్పిల్ వే దిగువన) భారీ గుంత ఏర్పడినట్లు నిపుణులు గుర్తించారు. ఈ గుంత భవిష్యత్ లో డ్యామ్ పునాదులకే ముప్పుగా మారుతుందని అప్పట్లోనే హెచ్చరించారు. 100 మీటర్ల కంటే ఎక్కువ లోతు, 400 మీటర్ల పొడవు, 270 మీటర్ల వెడల్పుతో భారీ గుంత ఏర్పడినట్టు, అది మరింతగా విస్తరిస్తే శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) పునాదులకే ప్రమాదం ఉంటుందని ఎన్ డీఎస్ఏ నిపుణుల కమిటీ కూడా ఎన్నడో తేల్చింది.
గతేడాది జూన్ లో సర్వే
శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) కు ఏర్పడిన ముప్పు తీవ్రత గుర్తించేందుకు గతేడాది జూన్ లో ‘ సీ లయన్ ఆఫ్ షోర్ డైవింగ్’ సంస్థతో నీటి అడుగున వీడియో తీయించి సర్వే చేశారు. ఈ సర్వేలో ప్లంజ్ పూల్ వద్ద ఉన్న రాళ్లు కోతకు గురై పెద్ద గుహలాంటి రంధ్రాలు ఏర్పడినట్టు తేల్చింది. దీంతో ఎన్డీఎస్ఏ అత్యవసర చర్యలు చేపట్టాలని సూచించింది. దెబ్బతిన్న 1 నుంచి 39 గేట్ల వరకు రక్షణ సిలిండర్లు మార్చాలని, లేదా మరమ్మతులు చేయాలని, అలాగే ప్లంజ్ పూల్ గుంతను కాంక్రీట్ తో లేదా రాళ్లతో పూడ్చాలని స్పష్టం చేసింది. డ్యామ్ కు చెందిన 5, 6 గేట్లు ద్వారా నీటి విడుదల తగ్గించాలని లేకపోతే ఎక్కువగా కోతకు గురవుతుందని పేర్కొంది. డ్యామ్ రక్షణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, పునాదులను రక్షించేందుకు గతంలో ఏర్పాటు చేసిన కాంక్రీట్, ఆఫ్రాన్ రక్షణ గోడలు, స్టీల్ సిలిండర్లు (1 నుంచి 39) చాలా దెబ్బతిన్నాయని, వరదల్లో కొట్టుకుపోయాయని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది.
ఈ ఏడాది జనవరిలో కదలిక
చానాళ్లుగా ప్రాజెక్టుకు పొంచిన ముప్పుపై ఎలాంటి చర్యలు లేకపోయినా కానీ, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో సీడబ్ల్యుసీ ఆధ్వర్యంలో ఈ ఏడాది మొదట్లో కేంద్రం టెక్నికల్ ఎక్స్ పర్ట్ గ్రూపును ఏర్పాటు చేసింది. ఇందులో సీడబ్ల్యూసీతో పాటు జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI), మరికొందరు నిపుణులతో కమిటీని వేసింది. ఈ కమిటీ డ్యామ్ ను పరిశీలించి మరమ్మతులకు సంబంధించి టెక్నికల్ సూచనలు చేస్తుంది. అనంతరం దీనిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి స్టడీకి పుణెకు చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (PWPRS)కు రూ.14 కోట్లు మంజూరు చేసింది.
ప్రపంచ బ్యాంకు నిధులు
ఈ డ్యామ్ పునరుద్ధరణ, భారీ గుంతను పూడ్చడానికి అధిక నిధులు (సుమారు రూ.780 –900 కోట్లు) ప్రపంచ బ్యాంకు సహకారంతో ‘డ్రిప్’ (రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూమెంట్ ప్రాజెక్ట్) కింద పనులు చేపట్టాలని ప్రతిపాదనలు ఉన్నాయి. స్టడీ, కమిటీల ఏర్పాటు పూర్తయింది కానీ క్షేత్రస్థాయిలో కాంక్రీట్ పనులు ఇంకా మొదలు పెట్టలేదు. కమిటీల నివేదికలు రాగానే పనులు ప్రారంభమవుతాయని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి.

