కలం, వెబ్ డెస్క్: భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అరంగేట్రంపై ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. అతి చిన్న వయసులోనే టీమిండియాకు ఎంపికై, ఆయన సచిన్ టెండూల్కర్ రికార్డునే బద్దలు కొట్టారు. త్వరలోనే ఐర్లాండ్ పర్యటనలో ఆయన సీనియర్ జట్టు తరఫున బరిలోకి దిగాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ఐర్లాండ్‌లో చెలరేగిన అంతర్గత అల్లర్లు ఈ సిరీస్‌ను ప్రమాదంలో పడేశాయి. అక్కడ ఉద్రిక్తతలు తీవ్రమవ్వడంతో ఇప్పటికే ఒక స్థానిక టీ20 టోర్నమెంట్‌ను రద్దు చేశారు. మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణపై క్రికెట్ ఐర్లాండ్ మరో 48 గంటల్లో నిర్ణయం తీసుకోనుంది. ఆటగాళ్లు, అభిమానుల భద్రతే తమకు ముఖ్యమని ఐరిష్ బోర్డు ప్రకటించింది.
మరోవైపు ఈ పరిస్థితులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కూడా అలర్ట్ అయింది. అక్కడ గొడవలు తగ్గకపోతే, మ్యాచ్‌లను బెల్‌ఫాస్ట్ నుండి వేరే ప్రాంతానికి మార్చాలని బీసీసీఐ యోచిస్తోంది. ప్రస్తుతం శ్రీలంకలో భారత్-ఎ జట్టుతో ఉన్న వైభవ్ సూర్యవంశీ కలల అరంగేట్రం సాఫీగా సాగుతుందో లేదో చూడాలి. ఈ అల్లర్ల వల్ల ఐర్లాండ్ సిరీస్ నిలిచిపోతుందా అనేది ఇప్పుడు తీవ్ర సస్పెన్స్‌గా మారింది. దీనిపై రెండు దేశాల బోర్డులు తీసుకునే తుది నిర్ణయం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

