Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్‌లో ‘కోవర్ట్’ కలకలం.. ఇంటి దొంగలు ఎవరు?

కలం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలోని (Telangana Congress) అంతర్గత సమాచారాన్ని ప్రత్యర్థి పార్టీకి చేరవేస్తున్నదెవరు?.. సీనియర్ నేతలకు సన్నిహితంగా ఉంటూనే కీలకమైన అంశాలను లీక్ చేస్తున్నదెవరు?.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జినే టార్గెట్ చేస్తూ కేసు విషయంలో బీజేపీకి ఉప్పందించిందెవరు?.. ఇప్పుడు పీసీసీ, ఏఐసీసీ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో ‘హిల్ట్’ పాలసీ జీవో రూపంలో తయారుకాకముందే ప్రత్యర్థుల చేతికి చేరింది.

కేబినెట్ సబ్ కమిటీల్లో చర్చించిన కొన్ని అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే బయటకు వెళ్లాయి. ఇలాంటి సందర్భాల్లో కొద్దిమంది ఆఫీసర్లపై అప్పట్లో అనుమానాలు రేకెత్తాయి. ఇంటెలిజెన్స్ విభాగం కూడా లోతుగా ఆరా తీసింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా పార్టీ స్టేట్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) కేసు వ్యవహారం మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకు చేరడం వెనుక ఎవరున్నారన్న దానిపై పీసీసీ, ఏఐసీసీ సీరియస్గా ఉంది.

గతంలోనూ చేరవేశారా?

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిగా మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేయడానికి సమర్పించిన నామినేషన్‌లో తెలంగాణలో నమోదైన కేసు విషయాన్ని పేర్కొనలేదంటూ ఈసీకి అక్కడి బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. అయితే.. తమకు కేసు సమాచారాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ నేతలే ఇచ్చారంటూ మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గియా మీడియా ముందు ప్రకటించారు. పేర్లు మాత్రం చెప్పలేదు. దీన్ని మొదట కాంగ్రెస్ పెద్దలు కొట్టివేశారు. కావాలనే బీజేపీ మైండ్ గేమ్ ఆడుతున్నదని భావించారు.

కానీ, ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారు. ఇంటి గుట్టును రట్టు చేస్తున్న నేతలెవరనేది కనిపెట్టడంపై ఫోకస్ పెట్టారు. కోవర్టు చర్యలకు పాల్పడుతున్న వాళ్లు ఎవరని ఆరా తీస్తున్నారు. గతంలోనూ కీలకమైన సమాచారాన్ని ఇదే తరహాలో ప్రత్యర్థులకు చేరవేశారా?.. అనే చర్చ కూడా కాంగ్రెస్‌లో మొదలైంది.

రహస్య నిర్ణయాలు బయటకు..!

రాష్ట్రంలో కాంగ్రెస్ (Telangana Congress) అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయిన సందర్భంగా పరిపాలనను స్పీడప్ చేసి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించాలని భావిస్తున్న ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి తాజాగా మీనాక్షి ఎపిసోడ్ ఊహించని షాక్ ఇచ్చినట్లయింది. అంతర్గత విభేదాలకంటే ‘సమాచార లీకేజీ’ పార్టీకి, ప్రభుత్వానికి శాపంగా మారింది. ప్రభుత్వానికి సంబంధించిన రహస్య నిర్ణయాలు, కేబినెట్ సబ్-కమిటీల ముసాయిదా నివేదికలు, చివరికి పార్టీ అంతర్గత వ్యూహాలు అధికారికంగా బయటకు రాకముందే ప్రత్యర్థి పార్టీల టేబుల్‌పై వాలడం తీవ్ర సంచలనంగా మారింది. ఒకదాని తర్వాత ఒకటిగా బయటకు వస్తున్న లీకులు గాంధీభవన్‌తో పాటు సీఎంవో వర్గాల్లోనూ కలకలం రేపుతున్నాయి.

సీరియస్ యాక్షన్

సమాచార లీకేజీలు యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావని, పక్కా ప్లానింగ్ ప్రకారమే జరుగుతున్నదని, దీని వెనక కొందరు కీలక వ్యక్తుల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. పార్టీలోని సీనియర్లకు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల పనేనని నేతలు అనుమానిస్తున్నారు. ఇప్పటిదాకా కీలక ఫైళ్ల సమాచారాన్ని సేకరించి ప్రతిపక్ష నేతలకు చేరవేస్తున్నారని బ్యూరోక్రాట్లు, కొందరు ఉద్యోగులపై బలమైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీ అంతర్గత సమాచారాన్ని చేరవేయడంతో సొంత పార్టీ నేతల పనే అనే కంక్లూజన్‌కు పీసీసీ వచ్చింది. ఆ కోవర్టులపై ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినట్లు సమాచారం. త్వరలోనే క్రమశిక్షణా చర్యలుంటాయని తెలిసింది.

Read Also: బొద్దింకపై నిఘా.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’పై కేంద్రం స్పెషల్ ఫోకస్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>