కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) జిల్లాలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. నగరంలో రాత్రి వేళ ప్రారంభమైన వర్షం ఉరుములు, మెరుపులతో కూడుకుని కురవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం కారణంగా నగరంలోని రహదారులు జలమయంగా మారాయి. అంతకుముందు భారీ ఈదురు గాలులు వీయడంతో వాహనదారులు ఇళ్లకు చేరుకునేందుకు తొందరపడగా, రోడ్లపై రద్దీ కనిపించింది. సిరికొండ మండలంలో 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అనేక మండలాలలో వర్షం కురిసింది.
వాతావరణ శాఖ నిజామాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) ప్రకటించడం గమనార్హం. శుక్రవారం మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండలు, వేడి గాలులతో ప్రజలు ఇబ్బందులు పడగా, సాయంత్రం వరకు ఉక్కపోత కొనసాగింది. అయితే రాత్రి కురిసిన వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఇన్నాళ్లుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు వర్షంతో వచ్చిన చల్లని గాలులతో ఉపశమనం పొందారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా, వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

