Mobile Popup Ad
Mobile Popup Ad

కోచ్ vs సీనియర్స్.. టీమిండియాలో ‘కోల్డ్ వార్’?

కలం, స్పోర్ట్స్: 2027 వన్డే వరల్డ్ కప్ (Team India World Cup) కు ఇంకా 16 నెలల సమయం ఉన్నప్పటికీ టీమిండియాలో అప్పుడే ఆ హీట్ మొదలైంది. ఆఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ తో ప్రపంచకప్ సన్నాహకాలు ప్రారంభం కానున్న వేళ.. డ్రెస్సింగ్ రూమ్ లో జరుగుతున్న అంతర్గత పరిణామాలు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జట్టు భవిష్యత్తు ప్లాన్స్, సీనియర్ల కెరీర్ పై సస్పెన్స్ నడుస్తుండగా.. కొందరు స్టార్ క్రికెటర్లు నేరుగా బీసీసీఐ పెద్దలను సంప్రదించడం ఇప్పుడు సంచలనం రేపుతున్నది.

గంభీర్ ‘మార్క్’ సక్సెస్

గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టాక టీమిండియా వైట్ బాల్ (పరిమిత ఓవర్లు) క్రికెట్ లో సరికొత్త శకానికి తెరలేపింది. ఆయన పక్కా ప్లానింగ్ తోనే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. టీ20 ప్రపంచకప్ ను కైవసం చేసుకుంది. టీ20ల్లో యువ రక్తాన్ని ప్రోత్సహిస్తూ.. ఎంతటి స్టార్ ఆటగాడైనా సరే కఠిన నిర్ణయాలు ఉంటాయని గంభీర్ హింట్ ఇచ్చారు. అయితే, భవిష్యత్తు వన్డే ప్రణాళికలు, ముఖ్యంగా 2027 ప్రపంచకప్ రోడ్ మ్యాప్ విషయంలో సీనియర్ల పాత్రపై మాత్రం ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందనే టాక్ నడుస్తున్నది.

కోచ్ ను బైపాస్ చేసి.. డైరెక్ట్ గా బోర్డు వద్దకే!

తాజా రిపోర్ట్స్ ప్రకారం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతోపాటు కొందరు సీనియర్లు 2027 ప్రపంచకప్ రోడ్ మ్యాప్ పై క్లారిటీ ఇవ్వాలని బీసీసీఐ పెద్దలను కోరినట్లు తెలుస్తున్నది. రాబోయే 16 నెలల్లో మేనేజ్మెంట్ ఆలోచనలు ఏంటి? జట్టులో తమ పాత్ర ఎలా ఉండబోతోంది? మెగా టోర్నీకి వెళ్లే మార్గంలో తమ స్థానాలపై ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? వంటి విషయాలపై వారు సమాధానాలు ఆశిస్తున్నారు. అయితే, ఈ చర్చలు హెడ్ కోచ్ ద్వారా కాకుండా నేరుగా బోర్డు అధికారుల వద్దకు వెళ్లడం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత బ్రేకులు

2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన తర్వాత వన్డేల్లో భారత్ ప్రదర్శన గ్రాఫ్ కాస్త పడిపోయింది. ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్లతో జరిగిన సిరీస్ లలో పరాజయాలు ఎదురయ్యాయి. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ హామ్స్ట్రింగ్ గాయంతో ఆఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. రోహిత్ శర్మ ఇదివరకే వన్డే కెప్టెన్సీ బాధ్యతలను శుభ్మన్ గిల్ కు అప్పగించినా.. జట్టులో అతని భవిష్యత్తు పాత్రపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. అటు రవీంద్ర జడేజాకు కూడా అక్షర్ పటేల్ రూపంలో గట్టి పోటీ ఎదురవుతున్నది.

యంగ్ కెప్టెన్ కు పరీక్ష

గతేడాది నుంచి పూర్తి స్థాయి వన్డే కెప్టెన్గా వ్యవహరిస్తున్న శుభ్మన్ గిల్కు ఆశించిన విజయాలు దక్కలేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్ల ఓటములు అతని కెప్టెన్సీ రికార్డును ఇబ్బంది పెట్టాయి. దీంతో డ్రెస్సింగ్ రూమ్లో గిల్ ప్రభావం ఎంతవరకు ఉందనే చర్చ మొదలైంది. సీనియర్లు ఎక్కువగా ఉన్న జట్టును లీడ్ చేయాలంటే, గిల్ మరింత దూకుడుగా, బలంగా తన నిర్ణయాలను వినిపించాలని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

ఏజ్ వర్సెస్ ఫామ్

వచ్చే నవంబర్ నాటికి కోహ్లీకి 38 ఏండ్లు నిండుతాయి. ప్రతిసారీ తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదనే సంకేతాలను ఆయన ఇప్పటికే ఇచ్చారు. మరోవైపు, 39 ఏండ్ల రోహిత్ శర్మ 2027 ప్రపంచకప్ ఆడాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తున్నది. టీమిండియాకు అపారమైన విజయాలు అందించిన ఈ ఇద్దరు దిగ్గజాల పాత్ర రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

‘మిషన్ 2027’.. పునాది పడేది ఇక్కడే!

జూన్ 13 నుంచి ఆఫ్గానిస్తాన్ తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్తో టీమిండియా వరల్డ్ కప్ ప్రయాణం అధికారికంగా షురూ కానుంది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలు ఒక్కరోజులో గెలవలేరు. వాటి విజయానికి పునాది ఏండ్ల ముందే పడాలి. ప్రస్తుతం టీమిండియాలో జరుగుతున్న అంతర్గత చర్చలు కూడా ఆ ఉద్దేశంతోనే సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో టీమ్ మేనేజ్మెంట్, సీనియర్ ఆటగాళ్లు ఒకే తాటిపైకి వచ్చి సమన్వయంతో అడుగులు వేస్తేనే.. ‘మిషన్ 2027’ సన్నాహకాలకు తిరుగులేని రోడ్ మ్యాప్ లభిస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>