కలం, ఢిల్లీ బ్యూరో: కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party).. కొన్నిరోజులుగా దేశంలో ఇదే ట్రెండింగ్! సోషల్మీడియాలో ఏ పోస్ట్ చేసినా దీని గురించే.. ఎవరి నోట విన్నా దీని ముచ్చటే! మే 16న ప్రారంభమైన ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్.. కేవలం 4-5 రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 1.47 కోట్లకు పైగా ఫాలోవర్లను సంపాదించింది. చెప్పినట్టుగానే జూన్ 6న జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) ఆందోళన చేపట్టారు. మద్దతుగా జెన్ జీ యువత, నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు.
నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతానికి కాక్రోచ్ జనతా పార్టీకి (Cockroach Janata Party) రాజకీయ పార్టీ స్వరూపం లేదు. కానీ, ఎప్పుడైనా ప్రమాదమేనన్న అంచనాతో కేంద్ర నిఘా వర్గాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ‘కాక్రోచ్’ కదలికలపై ఆరా తీస్తున్నాయి. గతంలో జరిగిన రైతు ఉద్యమ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ తరహాలో ఇది విస్తరించకుండా, కేంద్రీకృతం కాకుండా నిరోధించడంపై కసరత్తు జరుగుతున్నది.
‘కాక్రోచ్’ వెనక ఎవరున్నారు.. నిధులు ఎలా సమకూరుతున్నాయి.. ఫండింగ్ చేస్తున్నదెవరు.. మద్దతు పలుకుతున్నదెవరు.. ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, వివిధ సంస్థలు సపోర్ట్ చేస్తున్నాయా.. ఇలాంటి అన్నింటిపై నిఘా సంస్థల దృష్టి కేంద్రీకృతమైంది. దీనికి తోడు సోషల్ మీడియాలోని ప్రతీ పోస్టును విశ్లేషిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం. ఇతర దేశాల్లోనూ ‘కాక్రోచ్’ తరహా సోషల్ మీడియా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిశాయి. వాటికి జెన్ జీ, నిరుద్యోగులు జతకలవడంతో పాలకులు దిగిపోవాల్సి వచ్చింది. ఇండియాలో కూడా అలాంటి ఉద్యమాలు మొదలైతే సమస్య తీవ్రమవుతుందని కేంద్రం నిఘా పెట్టినట్లు తెలుస్తున్నది.
కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) కదలికలపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. జంతర్ మంతర్ వేదికగా ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ప్రస్తుతం పరిమిత స్థాయిలో కనిపిస్తున్నా.. కేంద్ర భద్రతా, నిఘా సంస్థలు దీనిని సాధారణ ఆందోళనగా చూడడం లేదు. ఆరేండ్ల క్రితం రైతు సంఘాలు సింఘు బార్డర్, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దులను సెంట్రిక్గా చేసుకుని నెలల తరబడి ఉద్యమించాయి. ఇది దేశ రాజకీయ అజెండానే మార్చేసిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఈ ఆందోళనలు జరిగాయి.
కాక్రోచ్ పార్టీ ఆందోళనలు అలాంటి తరహా పరిస్థితికి దారితీయొద్దన్నది కేంద్రం ఉద్దేశం. నీట్ పేపర్ లీకేజీపై ‘కాక్రోచ్’ మండిపడుతున్నది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని జంతర్ మంతర్ వేదికగా డిమాండ్ చేసింది. ఆయన రాజీనామా చేసే వరకు తగ్గేది లేదంటూ తేల్చిచెప్పింది. ఈ నెల 20న మరోసారి జంతర్ మంతర్ వేదికగా ఆందోళన చేపడుతామని తాజాగా ప్రకటించింది.
ఇలాంటి పరిణామాల దృష్ట్యా.. ప్రారంభ దశలోనే పరిస్థితిని కంట్రోల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతానికి ‘కాక్రోచ్’ ఒక నిరసనగానే మొదలైనా చివరికి రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు, యువజన సంస్థలు, అసంతృప్తి వర్గాల సపోర్ట్ పెరిగితే పరిస్థితి అనూహ్యంగా మారిపోతుందన్నది నిఘా వర్గాల అంచనా. రైతు ఉద్యమం కూడా తొలుత పంజాబ్ రైతుల సమస్యగా మొదలై ఆ తర్వాత జాతీయ ఉద్యమంగా మారిన విధానాన్ని ఒక కేస్ స్టడీగా పరిశీలిస్తున్నాయి.
‘సోషల్’ పోస్ట్ లపై స్పెషల్ ఫోకస్..
కాక్రోచ్ జనతా పార్టీకి ఫిజికల్‌గా స్పష్టమైన స్వరూపం లేనప్పటికీ సోషల్ మీడియా పోస్టులు, యూత్ ఫాలోయింగ్, వాటిపై స్పందన.. ఇవే కేంద్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్న అంశాల్లో ప్రధానమైనవి. రైతు ఉద్యమం సమయంలో టిక్‌టాక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికల ద్వారా ఉద్యమానికి భారీ ప్రచారం లభించింది. ప్రస్తుతం జెన్-జీ ఓటర్లలో రాజకీయ అసంతృప్తి, నిరుద్యోగం, అవకాశాలపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.
ఇలాంటి సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ ఈ భావజాలాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చని, అది రాజకీయంగా బీజేపీకి సవాల్గా మారే అవకాశం ఉందన్నది నిఘా వర్గాల కేంద్రీకరణ వెనకున్న మరో కోణం. ఈ కారణంగానే సోషల్ మీడియా ట్రెండ్స్, డిజిటల్ క్యాంపెయిన్, ఇన్‌ఫ్లూయెన్సర్ నెట్‌వర్క్‌లపై అవి ప్రత్యేక దృష్టి పెట్టాయి. భవిష్యత్తులో ‘కాక్రోచ్’ ఉద్యమం ఏ టర్న్ తీసుకుంటుంది, ఏ మేరకు స్ట్రాంగ్ అవుతుంది, దానికి అది తీసుకునే నెరేటివ్ ఏంటి.. ఇవే ఇప్పుడు కీలకంగా మారాయి. దీన్ని అంచనా వేయడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, రాష్ట్రాల ఇంటెలిజెన్స్ విభాగాలు, కేంద్ర భద్రతా సంస్థలు దృష్టి పెట్టాయి.
ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో అలర్ట్!
అధికారికంగా పూర్తి వివరాలు బయటకు రాకపోయినా.. ఢిల్లీకి సరిహద్దుగా ఉన్న హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల పోలీసు యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సూచించినట్లు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. కాక్రోచ్ క్యాంపెయిన్ ఉధృతమైతే అది స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయికి మారే ప్రమాదం ఉందన్న వాదన వినిపిస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో జంతర్‌మంతర్ దగ్గర లేదా ఢిల్లీ సమీపంలో దీర్ఘకాలిక ఆందోళనగా మారకుండా, ఇతర రాష్ట్రాల్లోకి దాని యాక్టివిటీస్ వ్యాప్తి చెందకుండా ప్రారంభంలోనే కట్టడి చేయాలని కేంద్ర భావిస్తున్నట్లు చర్చ నడుస్తున్నది.
శాంతి భద్రతల సమస్యగా మారకుండా చూడడంతో పాటు అది బలపడితే ఏ షేప్ తీసుకుంటుందనేది ఊహించలేమన్నది కూడా మరో అంశం. కాక్రోచ్ పార్టీ ఉద్యమానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఇతర రాష్ట్రాల్లో సంఘీభావ కార్యక్రమాలు మొదలవుతున్నాయా.. రైతు, కార్మిక, విద్యార్థి సంఘాలు లాంటివి ఇందులో భాగమవుతున్నాయా.. ఇలాంటి అంశాలపై సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి.
ఆచితూచి అనుమతులు!
ఢిల్లీలో ‘కాక్రోచ్’ యాక్టివిటీస్‌ను నియంత్రించడంపై ఎక్కువ దృష్టి కేంద్రీకృతమైంది. చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు రాజకీయంగా సున్నితమైనవి.. త్వరలో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున భారీ జన సమీకరణలు, బస్సు యాత్రలు, ట్రాక్టర్ ర్యాలీలు, విద్యార్థి ర్యాలీలు వంటి అంశాలపై కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. రైతు ఆందోళనలను కూడా కేంద్ర ప్రభుత్వం మొదట చిన్న సమస్యగానే భావించింది. కానీ అది ఉద్యమం షేప్ తీసుకుని సింఘు బార్డర్ దగ్గర శాశ్వత శిబిరాలుగా వేసుకోవడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది.
అందుకే ఈసారి కాక్రోచ్ మూవ్‌మెంట్ సైతం అలాంటి స్టేజ్‌కు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నది. ముందస్తు సమాచారాన్ని సేకరించడం, ఉద్యమ విస్తరణ సంకేతాలను ముందుగానే గుర్తించడం, నిరసనలకు అనుమతుల విషయంలో పకడ్బందీ ప్లాన్ చేసుకోవడం వంటి వాటిని కేంద్రం సీరియస్‌గా ఉన్నది. స్థానిక పరిస్థితుల రీత్యా నిరసనలు తప్పనిసరి అయితే దాన్ని పరిమిత ప్రాంతానికి, పరిమిత సమయానికి, పరిమిత సంఖ్యలో పాల్గొనేలా చూసుకోవాలన్నది హోంశాఖ భావన.
ఒకవైపు కట్టడి.. మరోవైపు చర్చలు!
కాక్రోచ్ ఆందోళనలు ఉద్యమ రూపం తీసుకోకుండా, మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీలకు డ్యామేజ్ కలగకుండా కంట్రోల్ మెకానిజం గురించి హోంశాఖ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. ఉద్యమానికి భారీ స్థాయిలో ప్రజా మద్దతు రాకముందే చర్చలు, హామీలు, వీలైతే లీడర్‌షిప్‌ను వీక్ చేయడం వంటివి ప్రధాన వ్యూహంగా కనిపిస్తున్నది. నిరసనలు పెద్ద ఎత్తున జరిగితే కొద్ది మంది చేసే హింసాత్మక చర్యలు మొత్తం ఉద్యమాన్నే ప్రభావితం చేస్తాయని, రైతు ఉద్యమ సమయంలో జనవరి 26న ఇదే జరిగిందని, అది రాజకీయ అంశంగా మారిందన్నది ఒక అభిప్రాయం.
అందుకే ఈసారి సోషల్ మీడియా పోస్ట్ల్ని నిరంతరం పర్యవేక్షిస్తుండడం, రెచ్చగొట్టే ప్రసంగాలపై ఓ కన్ను వేయడం, భారీ వాహన ర్యాలీలను నియంత్రించడం, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరించడం.. ఇలాంటివాటిపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. నిరసన దేశవ్యాప్తం కాకముందే, బీజేపీ వ్యతిరేక శక్తులకు వేదికగా మారకముందే అలర్ట్ కావాలన్నది హోంశాఖ లక్ష్యం. వీటన్నింటి నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ లీడర్‌షిప్‌లోని వ్యక్తుల్ని గుర్తించి.. వారితో తెరవెనక సంప్రదింపులు జరిపి యాక్టివిటీస్‌ను కట్టడి చేయడం, బలహీనపర్చాలన్న ఆలోచన కేంద్రం చేస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
నాలుగంచెల వ్యూహం
రైతు ఉద్యమం చేదు అనుభవంతో ఈసారి కాక్రోచ్ ఆందోళనల విషయంలో ముందస్తు నిఘా, కఠినమైన పర్మిషన్ సిస్టమ్, డిజిటల్ మానిటరింగ్, పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్ తదితర నాలుగంచెల వ్యూహాన్ని కేంద్రం ఆలోచిస్తున్నది. పరిస్థితిని ప్రారంభంలోనే నియంత్రించాలన్నది ప్రధాన ఉద్దేశం. ‘ఆపరేషన్ కంటైన్‌మెంట్’ వ్యూహాన్ని అమలు చేయనున్నది.
కాక్రోచ్ కేడర్ ఢిల్లీకి ఎలా చేరుకుంటోంది.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎలాంటి పోస్టులు ఉంటున్నాయి, క్లోజ్డ్ చాట్ గ్రూపులతో సమాచారాన్ని ఎలా షేర్ చేసుకుంటున్నారు, కలిసొచ్చే శక్తుల్ని ఎలా ఏకం చేస్తున్నారు.. ఇలాంటివన్నీ నిఘా సంస్థల కార్యాచరణలో కొన్ని. విదేశీ శక్తులు లేదా ముసుగు సంస్థల ప్రమేయంపైనా సమాచారాన్ని సేకరిస్తున్నాయి. అనధికారిక ఫోన్ కాల్స్, భేటీల వివరాలపైనా నిఘా కొనసాగుతున్నది. సమస్య తీవ్రమైన తర్వాత స్పందించడానికి బదులు ముందుగానే నివారించే వ్యూహంలో కేంద్రం ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
Read Also: రేపటి నుంచి వారం రోజుల పాటు మోడీ విదేశీ పర్యటన
Follow Us On : WhatsApp

