కలం, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే టీఎంసీ పార్టీని కీలక నేతలు వీడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై కోల్‌కతాలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మతపరమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు దాఖలైన నేపథ్యంలో ఆమెపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు.
గత మార్చిలో ధర్మతలలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని తుషార్ కాంతి దాస్ అనే వ్యక్తి కోల్‌కతాలోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎన్నికల నియమావళిని, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించిన ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ పోలీసులను కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

