కలం, వరంగల్ బ్యూరో : మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే యజమానులుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నది. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మహిళల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. వడ్డీ లేని రుణాలు, మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాల తర్వాత ఇప్పుడు మహిళలను ఆర్టీసీ బస్సుల యజమానులుగా మార్చే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహిళా సంఘాలకు 86 బస్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మహిళా ఆర్థిక సాధికారతలో మరో మైలురాయిగా నిలిచింది. తెలంగాణ మహిళా శక్తి (Telangana Mahila Shakti) పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా మండల మహిళా సమాఖ్యలు తమ సొంత నిధులైన రూ.199.08 కోట్లతో 553 బస్సులను కొనుగోలు చేసి టీజీఆర్టీసీకి అద్దెకు ఇచ్చాయి.
ఉమ్మడి వరంగల్ కు 86 బస్సులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహిళా సమాఖ్యలకు మొత్తం 86 బస్సులు అందించారు. ఇందులో వరంగల్ జిల్లాకు 11, హనుమకొండ జిల్లాకు 12 జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 11 బస్సులు, జనగామ జిల్లాకు 12 బస్సులు, ములుగు జిల్లాకు 9, మహబూబాబాద్ జిల్లాకి 16 బస్సులు కేటాయించారు. ఇంకా 15 బస్సులు పంపిణీ చేయాల్సి ఉంది. మహిళా సంఘాలకు అందించిన బస్సుల వల్ల ఒకవైపు ఆయా జిల్లాల్లో బస్సుల కొరత తగ్గి ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందుతున్నాయి. మరోవైపు మహిళా సంఘాలకు ప్రతి నెల స్థిరమైన ఆదాయం సమకూరుతోంది. దీంతో మహిళలు ఆర్థికంగా మరింత బలపడే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం మహిళలను సంక్షేమ పథకాల లబ్ధిదారుల స్థాయి నుంచి పెట్టుబడిదారులు, ఆస్తుల యజమానుల స్థాయికి తీసుకెళ్తోందని మహిళా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కొత్త దిశ చూపుతున్న ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందనే ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
కోట్ల ఆస్తులకు ఓనర్లుగా ఇలా..
ఒకప్పుడు రుణాల కోసం ఎదురుచూసిన స్వయం సహాయక సంఘాల మహిళలు నేడు కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు యజమానులుగా మారడం విశేషం. ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 అద్దె లభిస్తుండగా, 553 బస్సుల ద్వారా మహిళా సమాఖ్యలకు ప్రతి నెల రూ.3.84 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.20.34 కోట్ల అద్దె ఆదాయం అందడం ఈ పథకం విజయం.

