కలం, వెబ్ డెస్క్: జనసేన ఎమ్మెల్యే (Janasena MLA) అరవ శ్రీధర్ ప్రైవేట్ వీడియోల వివాదం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దీనిని సీరియస్‌గా తీసుకున్న జనసేన పార్టీ అంతర్గత విచారణకు ఆదేశించింది. సంబంధిత వీడియోలపై బాధిత మహిళ స్పందిస్తూ తనను మోసం చేసి శారీరకంగా ఉపయోగించుకున్నారని, మానసికంగా వేధించారని బహిరంగ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పూర్తిగా ఖండించారు. వైరల్ అవుతున్న వీడియోలు డీప్‌ఫేక్ సాంకేతికతతో తయారు చేసినవని, రాజకీయంగా తనను దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో బాధితురాలు సోషల్ మీడియా (Social Media)లో వేదికగా అనేక లీక్స్ ఇస్తూ శుక్రవారం మరో వీడియో బయటపెట్టింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించి వీడియోలు, చాటింగ్ దృశ్యాలను గంటకొకసారి విడుదల చేస్తోంది. అసెంబ్లీలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే శ్రీధర్ వీడియో కాల్ చేసిన దృశ్యాలను బయటపెట్టింది. అసెంబ్లీ నుంచే మహిళకు కుశల ప్రశ్నలు వేస్తూ వీడియో కాల్ చేయడం స్పష్టంగా కనిపించింది. ఊహించనివిధంగా బాధితురాలు అనేక వీడియోలు బయటపెడుతుండటంతో జనసేన పార్టీలో వణుకు మొదలైంది. ఎప్పుడు ఏం చేయబోతుందనే ఉత్కంఠ ఆ పార్టీ నేతల్లో నెలకొంది.


