కలం, నల్లగొండ బ్యూరో : మిర్యాలగూడ (Miryalaguda) మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నామినేషన్ల ప్రక్రియకు గడువు ముగియడంతో ఇక ప్రచార పర్వంపై అంతా దృష్టి పెడుతున్నారు. అయితే మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే ముగ్గురు బరిలోకి దిగడం చర్చనీయాంశమయ్యింది. మిర్యాలగూడ పురపోరులో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కీ రోల్ ప్లే చేస్తున్నారు. వార్డుల వారీగా ఎక్కడికక్కడ వ్యుహాలకు పదునుపెడుతున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భార్య మాధవి, కుమారులు సాయిప్రసన్న, ఈశ్వర గణేష్‌లను కౌన్సిలర్లుగా బరిలోకి దించారు. 28వ వార్డు నుంచి కొడుకు ఈశ్వరగణేష్, 39వ వార్డు నుంచి ఎమ్మెల్యే సతీమణి మాధవి, 40వ వార్డు నుంచి సాయిప్రసన్న పోటీ చేస్తున్నారు. ఈ అంశం కాస్త స్థానిక రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుంటే.. మిర్యాలగూడ (Miryalaguda) మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో ఎమ్మెల్యే తన సతీమణి మాధవిని చైర్ పర్సన్ ను చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే చైర్ పర్సన్ రేసులో ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో స్వయంగా ఎమ్మెల్యే భార్య పోటీలో ఉండడం ఆసక్తిని రేపుతోంది. ఒకవేళ పరిస్థితులు సహకరించకపోతే.. కొడుకులు ఇద్దరిలో ఒకరిని మున్సిపల్ వైస్‌చైర్మన్‌గా చేసేందుకు ఎమ్మెల్యే యోచినట్టు తెలుస్తోంది.


