Mobile Popup Ad
Mobile Popup Ad

SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్..

కలం, స్పోర్ట్స్​ : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఊహించని వార్త అందింది. గత సీజన్‌లో జట్టును ఫైనల్ వరకు నడిపించిన ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్, వెన్నునొప్పి కారణంగా ఈ సీజన్ మొదటి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను కొత్త కెప్టెన్‌ (SRH Captain)గా ప్రకటించింది.

ఐపీఎల్‌లో గతంలో కెప్టెన్సీ అనుభవం లేకపోయినా, దేశవాళీ క్రికెట్‌లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే జార్ఖండ్ జట్టు తొలిసారి సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ముఖ్యంగా హర్యానాతో జరిగిన ఫైనల్లో ఇషాన్ సెంచరీతో చెలరేగి జట్టును విజేతగా నిలబెట్టారు. ఈ ప్రతిభను గుర్తించిన సన్‌రైజర్స్ యాజమాన్యం ఆయనకు బాధ్యతలు అప్పగించింది. అలాగే, లోకల్ స్టార్ అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించింది.

భారత పిచ్‌లపై ఇషాన్ కిషన్‌కు ఉన్న పట్టు, మెగా వేలంలో ఆయనను భారీ ధరకు దక్కించుకోవడం వంటి అంశాలు ఆయనకు కెప్టెన్సీ దక్కేలా చేశాయి. అంతేకాకుండా, 2026 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి టీమిండియాలో తన స్థానాన్ని ఆయన సుస్థిరం చేసుకున్నారు. భారత వాతావరణ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న ఇషాన్, అభిషేక్ శర్మతో కలిసి జట్టును సమర్థవంతంగా నడిపిస్తారని యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.

ప్యాట్ కమిన్స్ గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో సతమతమవుతున్నారు. ఈ గాయం ప్రభావం ఆయన ఆటపై స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల ఆయన యాషెస్ సిరీస్‌లో కేవలం ఒకే ఒక టెస్టుకు పరిమితమయ్యారు. అంతేకాకుండా, ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026కు కూడా ఆయన దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ, ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌ల సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించడం సాధ్యం కాదని తేలడంతో ఈ మార్పు తప్పలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>