కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని తొలగించిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. దయారా గ్రామంలోని సర్వే నం 71, 174 లోని జంగం కుంటలో ఉన్న ఆలయంలో చిత్తారమ్మ అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీంతో వీహెచ్ పీ, బజరంగ్ దల్ సభ్యులు సుల్తాన్ పూర్ రింగ్ రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు. గతంలోనూ ఇదే తరహాలో అమ్మవారి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అమ్మవారి ఆలయం ఉన్న స్థలాన్ని టీజీఐఐసీ ఓ కంపెనీకి ఒప్పందంపై అప్పగించింది. టీజీఐఐసీ సంస్థ పేరిట ఉన్న సర్వే నెంబర్ 71, 174 లో 40 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలోనే అమ్మవారి ఆలయం ఉంది. విగ్రహాన్ని తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


