కలం, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ కగార్ ముగింపు దశకు చేరుకుంటుండడంతో కేంద్ర ప్రభుత్వ తదుపరి టార్గెట్ ఎవరన్నది ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. మావోయిస్టు పార్టీ కుంభస్థలాన్ని కొట్టి విజయం సాధించామని, దాదాపు 95% టార్గెట్ రీచ్ అయ్యామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆపరేషన్ కగార్ సక్సెస్‌పై గత నెలలో చత్తీస్‌గఢ్‌లో జరిగిన సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో సాధించిన ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. షెడ్యూలు ప్రకారం ఈ నెల 31న కగార్ డెడ్‌లైన్ ముగుస్తుండడంతో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ వ్యూహాన్ని అవలంబిస్తుందనే సస్పెన్స్ నెలకొన్నది. తదుపరి టార్గెట్ అర్బన్ నక్సల్స్ (Urban Naxals) అంటూ కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ పలు సందర్భాల్లో హైదరాబాద్‌లో వ్యాఖ్యానించారు. మావోయిస్టు పార్టీకి వేర్వేరు రూపాల్లో సహకరిస్తున్నవారిపైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మావోయిస్టు సంబంధిత కేసుల్లో ఎన్ఐఏ నోటీసులు :
మావోయిస్టు పార్టీతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానో పట్టణాల్లో నివసిస్తున్న పౌరహక్కుల కార్యకర్తలు, లాయర్లు, ప్రొఫెసర్లు, వివిధ వృత్తుల్లో ఉన్నవారు సహకరిస్తున్నారని అమిత్ షా మొదలు స్థానిక బీజేపీ నేతల వరకు వివిధ సందర్భాల్లో కామెంట్లు చేశారు. మావోయిస్టు పార్టీపై దేశవ్యాప్తంగా నిషేధం ఉన్నందున ఏ రూపంలో సహకరించినా అది కూడా నేరం కిందకే వస్తుందని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ కగార్ డెడ్‌లైన్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ అర్బన్ నక్సలైట్లే (Urban Naxals) అని బీజేపీ నేతలు చెప్పకనే చెప్పినట్లయింది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో పలువురికి ఎన్ఐఏ నుంచి నోటీసులు అందాయి. వేర్వేరు తేదీల్లో గచ్చిబౌలిలోని బ్రాంచ్ ఆఫీసులో విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసుల్లో చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పేర్కొన్నారు. వరంగల్, సిద్దిపేట్ జిల్లాల్లోని పలువురికి ఈ నోటీసులు అందాయి.
మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపణలు :
మావోయిస్టు పార్టీకి, అందులో పనిచేస్తున్న నేతలకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం, ఆ పార్టీ సిద్ధాంతాలను, రాజకీయాలను ఎంకరేజ్ చేయడం.. వీటికి సంబంధించి ఎన్ఐఏ (NIA) గతంలో పలువురిపై కేసులు నమోదు చేసింది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కాతా రామచంద్రారెడ్డి గతేడాది సెప్టెంబరులో ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తర్వాత ఆయన సంస్మరణ సభలో చేసిన ప్రసంగాల నేపథ్యంలో ఈ కేసును (నెం. 4/-2025) నమోదు చేసినట్లు నోటీసులు అందుకున్నవారి అనుమానం. చనిపోయిన మావోయిస్టుకు మద్దతుగా, కగార్‌కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టేలా మాట్లాడారని, అందువల్లనే భారత్ న్యాయ సంహితలోని సెక్షన్ 152, ‘ఉపా’ చట్టంలోని సెక్షన్ 13, 39 కింద అభియోగాలు నమోదయ్యాయి. కొందరిని ఈ నెల 18న, మరికొందరిని 20న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఎన్ఐఏ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పేర్కొన్నారు.
Read Also: మహాభారతంలో ఆ పాత్రలే నాకు ఆదర్శం: రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram



