SIRతో ప్రక్షాళన.. తెలంగాణలో 50 లక్షల ఓటర్లు డౌటే!!

కలం, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా చేపట్టాలనుకున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన (SIR) తెలంగాణలో ఏప్రిల్ ఫస్ట్ తర్వాత మొదలు కానున్నది. ఇప్పటికే ప్రిపరేటరీ వర్క్ స్టార్ట్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు మూడు వారాలుగా జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రాసెస్‌లో 30% మాత్రమే మ్యాచ్ అయినట్లు సమాచారం. హైదరాబాద్ మినహా జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే యావరేజ్‌గా 58% ట్యాలీ అవుతున్నట్లు తేలింది. ఇప్పటివరకు కొంతవరకు మాత్రమే జరిగిన ఈ ప్రక్రియను (Telangana SIR) పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 50 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి డిలీట్ అయ్యే అవకాశమున్నది. పూర్తిస్థాయిలో డోర్ టు డోర్ వెరిఫికేషన్ తర్వాతనే దీనిపై స్పష్టత రానున్నది. ఇప్పటివరకు ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాల్లో సైతం ఇంతకంటే ఎక్కువగానే ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యాయి.

ఒకిరికి రెండు చోట్ల పేర్లు కుదరదు :

ఒకే ఓటరుకు రెండు వేర్వేరు చోట్ల జాబితాలో పేర్లు ఉండకుండా సర్‌లో ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్నది. కొద్దిమంది ఓటర్లకు అటు స్వగ్రామంలో, ఇటు వారు పనిచేస్తున్న టౌన్‌లోనూ రెండు చోట్లా జాబితాలో పేర్లు ఉంటున్నట్లు ఇప్పటికే సీఈఓ స్టాఫ్ గుర్తించారు. పేరు, ఫోటో, ఓటరు కార్డు నెంబర్, పుట్టినరోజు తదితరాలను విశ్లేషించే ఆ సాఫ్ట్ వేర్ ఇలాంటి డూప్లికేషన్‌గా ఉండే ఓటర్లను గుర్తిస్తుంది. సర్ ప్రక్రియలో ఇలాంటి ఓటర్ల విషయంలో ఏదైనా ఒకటి మాత్రమే ఉంచుకునే ఛాయిస్‌ను ఓటరుకు కల్పిస్తుంది. రెండోచోట జాబితాలో డిలీట్ (Voter List Deletion) అవుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఓటర్ల జాబితాలో పేరు డూప్లికేట్ అయినా తెలిసిపోతుంది. హైదరాబాద్‌లో లక్షలాది మందికి అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో డబుల్ ఓట్లు ఉన్నాయని ప్రాథమికంగా తేలింది. ఛాయిస్ ప్రకారం ఒక చోట కంటిన్యూ అయితే రెండో చోట ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది.

అడ్రస్ ఛేంజ్, మృతుల పేర్లూ ఫిల్టర్ :

కొద్దిమంది పేర్లు 2002, 2025 ఓటర్ల జాబితాతో పోల్చినప్పుడు ప్రస్తుతం వేరే అడ్రస్‌లో ఉంటున్నట్లు సీఈఓ స్టాఫ్ గుర్తించారు. ప్రస్తుతం ఉన్న అడ్రస్‌కు సంబంధించిన ఆధారాలను డోర్ టు డోర్ సర్వే సందర్భంగా ఫామ్‌లో పేర్కొని, వాటి నకలు కాపీలను బీఎల్‌ఓలకు అందజేస్తే జాబితాలో అప్‌డేట్ అవుతుంది. ఈసీ పేర్కొన్న పన్నెండు రకాల అడ్రస్ ప్రూఫ్‌లలో ఏదైనా ఒకటి సరిపోతుంది. ఈ వడపోత కార్యక్రమంలో పాత అడ్రస్‌తో ఉన్న పేరు డిలీట్ అయ్యి ప్రస్తుతం ఉన్న దగ్గర కొత్తగా నమోదవుతుంది. మరికొన్ని సందర్భాల్లో మృతుల పేర్లు ఇప్పటికీ జాబితాలో కంటిన్యూ అవుతున్నాయి. సర్వే సమయంలో ఫామ్‌ను భర్తీ చేసి సంతకం చేయాల్సి ఉన్నందున ఆ సమయంలో వారి పేర్లు డిలీట్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో డెత్ సర్టిఫికెట్ సమర్పించి జాబితా నుంచి తొలగించాలని రిక్వెస్టు పెట్టినా డిలీట్ కాలేదన్న ఫిర్యాదులు ఉండనే ఉన్నాయి.

ప్రూఫ్ లేకపోతే డిలీట్ కావడం ఖాయం :

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన పన్నెండు రకాల ఐడీ/అడ్రస్ ప్రూఫ్‌లలో ఏ ఒక్కటి ఉన్నా ఓటర్ల జాబితాలో పేరు కంటిన్యూ అవుతుంది. కానీ ఏ ఆధారమూ లేనప్పుడు వారి పేర్లను జాబితాలో కొనసాగించలేమని ఎలక్షన్ సిబ్బంది స్పష్టం చేశారు. భారత పౌరులుకానివారు, వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నవారు (ప్రూఫ్‌లు లేకుండా), వివిధ దేశాల నుంచి వలస వచ్చి ఉంటున్న రోహింగ్యాల లాంటి కాందిశీకులు.. ఇలాంటివారందరూ ఫిల్టర్ అవుతారని, వారి పేర్లు జాబితా నుంచి తొలగించక తప్పదని పేర్కొన్నారు. ఇంతకాలం ఇక్కడే ఉండి ఇటీవలే మరో ప్రాంతానికి బదిలీ అయ్యి ప్రస్తుతం ఇక్కడ నివాసం లేనట్లయితే జాబితా నుంచి డిలీట్ కాక తప్పదన్నారు. ఇలాంటి అన్ని రకాల కేటగిరీల ఓటర్ల వడపోత సర్ ప్రక్రియతో కంప్లీట్ అవుతుందని వివరించారు.

యాభై లక్షలకంటే ఎక్కువే ఉండొచ్చు :

ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లలో జరిగిన సర్ ప్రక్రియతో దాదాపు ఏడు కోట్ల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి డిలీట్ అయ్యాయి. గరిష్టంగా ఉత్తరప్రదేశ్‌లో రెండు కోట్లకు పైగానే (ఇంకా ప్రక్రియ కంప్లీట్ కావాల్సి ఉన్నది) ఉన్నట్లు అంచనా. గుజరాత్‌లో 78 లక్షలు, తమిళనాడులో 97 లక్షలు, బీహార్2లో 58 లక్షలు, కేరళలో 12 లక్షలు, పశ్చిమబెంగాల్‌లో 66 లక్షల మంది పేర్లు డిలీట్ అయ్యాయి. ఫైనల్ ఫేజ్‌లో భాగంగా ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో తెలంగాణలో సర్ (Telangana SIR) ప్రక్రియ కోసం నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎంత మంది పేర్లు డిలీట్ అవుతాయన్నది కీలకం. దాదాపు 50 లక్షల మేరకు డిలీట్ కావచ్చని ఓ అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలో 3.36 కోట్ల మంది (2025 తుది జాబితా ప్రకారం) ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు ప్రిపరేటరీ వర్క్ లో భాగంగా జరిగిన మ్యాపింగ్ ప్రక్రియలో హైదరాబాద్‌లోని 87 లక్షల మంది ఓటర్లలో చాలా మంది పేర్లు మ్యాచింగ్ కాలేదు. దీంతో ఫైనల్‌గా ఎంతమంది పేర్లు గల్లంతవుతాయన్న చర్చ మొదలైంది.

Read Also: గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన గుడ్ల ధరలు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>