కలం, వెబ్ డెస్క్: మహిళలు అభద్రతా భావంతో ఉంటే ప్రభుత్వానికే అగౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో తెలంగాణ మహిళా భద్రత విభాగం స్టాండ్ విత్ హర్ (Stand With Her )అనే కార్యక్రమాన్ని చేపట్టింది. మహిళల భద్రత, పురుషుల బాధ్యత అనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
దేశానికి రాష్ట్రపతిగా , ప్రధాన మంత్రిగా, లోక్ సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం కల్పించిన కాంగ్రెస్‌కు తెలంగాణలో ప్రజలు అధికారం అప్పగించారని సీఎం వ్యాఖ్యానించారు. మహిళల ప్రాధాన్యతను గుర్తించి, బాధ్యతలను అప్పగించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. మహిళను మనం శక్తితో పోలుస్తామమని, అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతే ఏ రాష్టానికి గౌరవం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందు మహిళల వేధింపులు కొంతవరకే పరిమితమయ్యేవని, కానీ సాంకేతిక అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో సోషల్ మీడియాలోనూ మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు. చట్టాల రూపకల్పన, పోలీసులు పర్యవేక్షణతోనే సరిపెట్టకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మహిళల రక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.
మన ఇంటి ఆడబిడ్డలను గౌరవించినట్లే సమాజంలో ప్రతి ఆడబిడ్డను అలాగే గౌరవించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరుతో అందిస్తున్నామని సీఎం తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించి వారికి శిల్పారామం వద్ద దుకాణ సముదాయాన్ని కేటాయించినట్లు వెల్లడించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించి మహిళలు అదానీ, అంబానీలతో పోటీపడేలా చర్యలు చేపట్టామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు వెయ్యి బస్సులకు మహిళలనే యజమానులను చేశామన్నారు.
పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చర్యలు తీసుకున్నట్లు సీఎం తెలిపారు. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి మహిళా శక్తి స్ఫూర్తిని చాటామన్నారు. మహిళా శక్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని, దేశంలోనే తెలంగాణను మహిళలకు అంత్యంత భద్రత కలిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాలని స్టాండ్ విత్ హర్ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. మహిళా రక్షణకు ప్రతి యువకుడు బ్రాండ్ అంబాసిడర్ కావాలని పిలుపునిచ్చారు. మహిళలు వంటింటి కుందేళ్లుగా ఉండకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. మహిళలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సీఎం సూచించారు.

