బొగ్గు కుంభకోణం నుంచి డైవర్షన్​ కే హరీశ్​ రావుకు నోటీసులు : కేటీఆర్

కలం, వెబ్​ డెస్క్​ : ఫోన్​ ట్యాపింగ్​ కేసులో బీఆర్​ఎస్​ మాజీ మంత్రి హరీశ్​ రావుకు సిట్​ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) ఎక్స్​ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్​ రెడ్డి బావమరిది సుజన్​ రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని హరీశ్​ రావు బయటపెట్టినందుకే సిట్​ నోటీసులు జారీ చేసిందని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్​ పాలిటిక్స్ తప్ప మరోటి కాదని కేటీఆర్​ విమర్శించారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్​ పార్టీ ఏకైక అజెండాగా మారిందని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసును రాజకీయ కక్ష సాధింపు అని సుప్రీం కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు.

అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీశ్​ రావు (Harish Rao)కు నోటీసులు (SIT Notices) ఇవ్వడం రేవంత్​ రెడ్డి ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టడం, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడడంపై ఆయన చూపిస్తున్న చొరవను చూసి సీఎం రేవంత్​ రెడ్డికి వణుకు పుడుతోందని అన్నారు. అందుకే రాజకీయంగా ఎదుర్కోలేక, ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని కేటీఆర్​ దుయ్యబట్టారు.

24 నెలలుగా రేవంత్​ రెడ్డి దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీశ్​ రావును టార్గెట్ చేసి.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చట్టం, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉందన్న కేటీఆర్.. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విచారణ పేరుతో, నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తే అది భ్రమేనన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. వేధింపులకు గురి చేసినా ప్రజల పక్షాన వేటాడడం ఆపం అని తేల్చి చెప్పారు. అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం.. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని KTR తేల్చి చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>