ఒకే వేదిక మీదకు సరెండర్ లీడర్స్

కలం, తెలంగాణ బ్యూరో : ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) సక్సెస్‌ను కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసుకోవాలనుకుంటున్నది. అన్ని రాష్ట్రాలకు తెలిసేలా భారీ సక్సెస్ మీట్ నిర్వహించాలనుకుంటున్నది. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు (Maoist Party Leaders) నేతలందరినీ ఒకే వేదిక మీదకు చేర్చాలనుకుంటున్నది. పీఎల్‌జీఏ (PLGA) బెటాలియన్, కంపెనీల మిలీషియా ప్రభుత్వానికి అప్పగించిన ఆయుధాలను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పూర్తి చేయడానికి ఈ నెల 31 డెడ్‌లైన్ పెట్టుకున్నందున అదే రోజు లేదా ఆ తర్వాత ఒక భారీ వేదికను ఏర్పాటు చేసి అధికారికంగా వెల్లడించాలనుకుంటున్నది. ఇందులో ఆపరేషన్ పూర్తయినట్లు స్పష్టత ఇవ్వడంతో పాటు 27 నెలల కార్యాచరణ ఆశించిన ఫలితాలను ఇచ్చిందనే అంశాన్ని కూడా వెల్లడించనున్నది. జాతీయ, అంతర్జాతీయ ఫోకస్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నది.

రాష్ట్రాల మధ్య పకడ్బందీ సమన్వయం :

మావోయిస్టు యాక్టివిటీస్ ఉన్న అన్ని రాష్ట్రాలతో సమన్వయంతో ఆపరేషన్ కగార్‌ (Operation Kagar) అమలైంది. నిర్దిష్ట డెడ్‌లైన్ సమయానికి విజయం సాధించేలా టైమ్ లైన్ ఫిక్స్ అయింది. ఒకవైపు సైనిక చర్య, మరోవైపు టెక్నాలజీ వినియోగం, ఇంకోవైపు సైద్ధాంతిక సంక్షోభం, ఈ మూడింటికి తోడు మావోయిస్టు పార్టీలో ఇన్‌ఫార్మర్, కోవర్టు నెట్‌వర్క్ మెకానిజం.. ఇవన్నీ ఏకకాలంలో అమలు కావడంతో సక్సెస్ అయిందన్నది హోంశాఖ అభిప్రాయం. లొంగుబాట్లు, ఆయుధాల అప్పగింత వ్యూహంతో మావోయిస్టు పార్టీ దాదాపుగా ఉనికి కోల్పోయేలా చేసిన సక్సెస్‌ను ఢిల్లీ వేదికగానే వివరించాలన్నది హోంశాఖ భావన. వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ విభాగాలతో పాటు తెలంగాణ-ఏపీ రాష్ట్రాల్లో గ్రేహౌండ్స్ (Grey Hounds), చత్తీస్‌గఢ్‌లో డీఆర్‌జీ (DRG), ఒడిశాలో ఎస్ఓజీ (SOG).. ఇలాంటి విభాగాల హెడ్‌లు కూడా ఆ సక్సెస్ మీట్‌కు హాజరుకానున్నట్లు సమాచారం.

హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన :

ఆపరేషన్ కగార్‌కు రూపకల్పన చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) దాని అమలుపైనా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయాన్ని పెంపొందించారు. సమాచారాన్ని పరస్పరం పంచుకునే విధంగా ఢిల్లీ నుంచే కంట్రోల్ మెకానిజాన్ని నెలకొల్పారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ సాధించిన ఫలితాలను కూడా స్వయంగా ఆయనే వెల్లడించనున్నారు. ఢిల్లీ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల్లో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పోలిట్‌బ్యూరో, స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీలు/సభ్యులను, డివిజనల్ కమిటీ సెక్రటరీలు, బెటాలియన్/కంపెనీల కమాండెంట్లు.. ఇలాంటి సీనియర్ నేతలందరినీ అక్కడికి రప్పించాలని హోంశాఖ భావిస్తున్నది. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రులు, ఆ శాఖ సెక్రటరీలు, డీజీపీలు కూడా హాజరు కానున్నట్లు తెలిసింది.

రాష్ట్రాలతో సంప్రదింపుల తర్వాత డేట్ ఫైనల్ :

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన కేంద్ర హోంశాఖ మరికొన్ని రాష్ట్రాలతో మాట్లాడాల్సి ఉన్నది. ఈ నెలాఖరులోపు ఆ ప్రాసెస్‌ను పూర్తి చేసి ఢిల్లీ మీటింగ్ డేట్‌ను ఫిక్స్ చేయనున్నది. మార్చి 31 రోజునే పెట్టాలా?.. లేక ఆ తర్వాత మరో రోజును ఫిక్స్ చేస్తుందా?.. అనేది రానున్న రోజుల్లో స్పష్టం కానున్నది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ విజయకుమార్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ సుమతి తదితరులు హాజరుకానున్నారు. తెలంగాణలో లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సీసీ, పోలిట్‌బ్యూరో సభ్యులు, స్పెషల్ జోనల్/స్టేట్ కమిటీ సెక్రటరీలు, సభ్యులు, యాక్షన్ టీమ్ లీడర్లు, సీనియర్ నాయకులు హాజరు కానున్నట్లు సమాచారం.

Read Also: హుజూర్‌నగర్‌లో బట్టబయలైన భారీ ల్యాండ్ స్కామ్

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>