కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ స్థానాల్లో పోటీకి దూరంగా ఉండి బీఆర్ఎస్ (BRS) సెల్ఫ్ గోల్ చేసుకున్నది. ఒకే దెబ్బకు రెండు పిట్టల తరహాలో ప్రయోజనాలు పొందే అవకాశమున్నా చేజార్చుకున్నది. పోటీకి దూరంగా ఉండడంతో రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఏకగ్రీవంగా గెలవడానికి అవకాశం లభించింది. రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా గెలిచే అవకాశాలు ఎలా ఉన్నా పార్టీ ఫిరాయించారని పది మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చేస్తున్న ఆరోపణలకు తగిన బలమైన ఆధారాలను పొందే ఛాన్స్ ను మిస్ చేసుకున్నది. మరోవైపు మజ్లిస్ పార్టీని ఇరుకున పెట్టే అవకాశాన్ని కూడా వదులుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తరచూ విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ రాజ్యసభ ఎన్నికల విషయంలో ఎందుకు అనాలోచితంగా వ్యవహరించిందనే చర్చలు మొదలయ్యాయి.
చివరి నిమిషంలో పోటీ వద్దనే నిర్ణయం :
రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టాలని మొదటి నుంచీ పార్టీ నేతలు అనుకుంటూనే ఉన్నారు. గెలిపించుకోడానికి 40 మంది సభ్యుల బలం లేకపోయినప్పటికీ బరిలో ఉండడం ద్వారా కాంగ్రెస్‌ను కన్‌ఫ్యూజ్ చేయొచ్చని భావించారు. బలం లేకపోయినా ఎందుకు నిలబెట్టిందనే చర్చ జరగాలని కోరుకున్నారు. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మద్దతును తీసుకుంటుందోనని అటు బీజేపీలో, ఇటు కాంగ్రెస్‌లో టెన్షన్ పుట్టాలని అనుకున్నారు. అభ్యర్థిని నిలబెట్టే విషయమై పార్టీ అధినేత కేసీఆర్‌తో ఫామ్ హౌజ్‌కు వెళ్ళి కేటీఆర్ చర్చించారన్న సమాచారాన్నీ గులాబీ నేతలు మీడియాకు తెలిపారు. కచ్చితంగా రాజ్యసభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరిని నిలబెట్టాలనే నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకుంటారని తెలిపారు. బీఆర్ఎస్ లీడర్లు సైతం చాలా మంది పోటీ ఉంటుందని భావించినా చివరి నిమిషంలో ఆ నిర్ణయం మారిపోయింది. పోటీకి దూరంగా ఉండిపోయింది.
మజ్లిస్‌ను ఇరుకున పెట్టేలా మహమూద్ ఆలీ పేరు :
మహమూద్ ఆలీని రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టడంపై బీఆర్ఎస్‌లో చర్చలు జరిగాయి. మజ్లిస్ పార్టీ అనివార్యంగా మద్దతు ఇవ్వక తప్పదనే అభిప్రాయం గులాబీ నేతల్లో వినిపించింది. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే స్థానికుడైనా, ముస్లిం మైనారిటీ అయినా మజ్లిస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తో జతకట్టి నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నదని విమర్శించాలన్నది బీఆర్ఎస్ వ్యూహం. ఏ పార్టీ అధికారంలో ఉంటే దానితో అంటకాగుతుందనే అంశాన్ని నొక్కిచెప్పాలని భావించింది. మరోవైపు ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల రంగు కూడా బహిర్గతం చేయాలనుకున్నది. రాజ్యసభ ఎన్నికలు ఓపెన్ బ్యాలట్ కావడంతో ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారో బహిర్గతం చేయడానికి ఎలాంటి ఇబ్బందులూ లేవు. పోటీకి దూరంగా ఉండడంతో ఆ అవకాశాన్ని కూడా కోల్పోయామన్నది బీఆర్ఎస్ లీడర్ల టాక్.
ఇండిపెండెంట్‌కు ఉన్న ధైర్యం కూడా లేదా? :
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే పది మంది ఎమ్మెల్యేలు ప్రొపోజర్‌గా సంతకం చేయడం అవసరం. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి కాంగ్రెస్ తరఫున ఇద్దరు, ప్రొపోజర్‌ల సంతకాలు లేకుండానే స్వతంత్ర అభ్యర్థిగా సాయి నామినేషన్ దాఖలు చేశారు. కనీసం ఇండిపెండెంట్‌కు ఉన్న ధైర్యం కూడా బీఆర్ఎస్‌కు (BRS) లేదా అనే చర్చలు మొదలయ్యాయి. గెలుస్తామనే నమ్మకం లేకపోయినా, స్క్రూటినీలో తిరస్కరణకు గురవుతుందని తెలిసినా నామినేషన్ వేశారని, కానీ బీఆర్ఎస్ మాత్రం అవకాశాలు ఉన్నా పోటీకి దూరంగా ఉండడం ఆ పార్టీలోనే హాట్ టాపిక్‌గా మారింది. వ్యూహాత్మక తప్పిదమా?.. ఉద్దేశపూర్వకమా?.. భయమా?.. ఇలాంటివన్నీ ఆ పార్టీ లీడర్ల మధ్య గుసగుసలుగా మారాయి.
Read Also: ఒకే వేదిక మీదకు సరెండర్ లీడర్స్
Follow Us On: X(Twitter)

