epaper
Friday, January 23, 2026
spot_img
epaper

కేటీఆర్ విషనాగు.. నేనూ ట్యాపింగ్ బాధితుడినే : ఎమ్మెల్యే వేముల వీరేశం

కలం, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) జరిగింది ముమ్మాటికీ నిజమని, బాధితుల్లో తానూ ఒకడినని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) అన్నారు. సొంత బావ ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు కేటీఆర్(KTR) సొంత చెల్లెలు కవితే ఓపెన్‌గా చెప్పిందని గుర్తుచేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలే వాపోతుంటే సుద్దపూస అన్నట్లుగా కేటీఆర్ వ్యవహరించడం ఆయన కుట్రబుద్ధికి నిదర్శనమన్నారు. సీఎల్పీలో శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో వేముల వీరేశం మాట్లాడుతూ, పార్టీకి ప్రమాదం అని భావించిన చాలా మంది ఫోన్లను బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది వాస్తవమన్నారు. మంచివాడిలాగా నటిస్తున్న కేటీఆర్… ఓ విషనాగు, కాలనాగు అని కామెంట్ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ :

గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌ ప్రభాకర్‌రావును అడ్డం పెట్టుకుని ఇజ్రాయిల్ టెక్నాలజీని వాడి వేలాది మంది రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, జడ్జీలు.. ఇలాంటివారందరి ఫోన్లను ట్యాపింగ్ చేసిందని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. టెలిగ్రాఫ్ చట్టం నిబంధనలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించారు. దేశ భద్రత అవసరాల కోసం క్రిమినల్ యాక్టివిటీస్‌ను నివారించడం కోసం నిర్దిష్టంగా సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు.. ఇలాంటివారి ఫోన్లను మాత్రమే కేంద్ర హోంశాఖ అనుమతితో ట్యాపింగ్ చేయాలనే నిబంధనలను ఉన్నాయని, కానీ బీఆర్ఎస్ సర్కారు మాత్రం రాజకీయంగా తనకు ప్రమాదం ఉందనుకునేవారి ఫోన్లను ట్యాపింగ్ చేసిందని, అందులో తానూ ఒక బాధితుడినని అన్నారు.

నేరాన్ని ఒప్పుకుని లొంగిపోవాలి :

ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యక్తుల స్వేచ్ఛకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను ఉల్లంఘించిందన్నారు. నిన్నమొన్నటి వరకూ హరీశ్‌రావు ఫోన్ ట్యాపింగ్‌లో తనదైన పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నా తాజాగా పోలీసుల విచారణ సందర్భంగా ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్లు తేలిందని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్‌ దర్యాప్తులో ఒక్కో వాస్తవం వెలుగులోకి వస్తున్నదని, ఆధారాలు దొరుకుతున్నాయన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ డొంక తిరుగుడు మాటలను బంద్ పెట్టాలని, చట్టాన్ని ఉల్లంఘించి నేరానికి పాల్పడినట్లు ఒప్పుకుని లొంగిపోవడం ఉత్తమమని సూచించారు. సుద్దపూస డైలాగులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ బదనాం చేస్తున్నారని ఆరోపించారు.

ఇక కేసీఆర్ వంతు తప్పదు :

ఫోన్ ట్యాపింగ్‌లో ఇప్పటికే హరీశ్‌రావును సిట్ పోలీసులు విచారించారని, ఇప్పుడు కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నారని, ఇక కేసీఆర్ వంతు తప్పదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించినట్లు కొద్దిమంది వ్యాపారులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారని, వారిని విచారణకు పిలిచి వాంగ్మూలాన్ని రికార్డు చేశారని ఆయన గుర్తుచేశారు. సొంత చెల్లెలే బహిరంగంగా తన భర్త ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ఆరోపించిందని, ఆమెను కూడా పోలీసులు పిలిచి వివరణ తీసుకునే అవకాశమున్నదని అన్నారు. విపక్షాల నేతలు ఫోన్ ట్యాపింగ్‌పై మాట్లాడితే విమర్శలంటూ కామెంట్ చేస్తున్న కేటీఆర్.. తన సొంత చెల్లెలు చేసిన ఆరోపణలకు సమాధానమేంటని ప్రశ్నించారు. హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు వచ్చిన ఆరోపణలను సిట్ తేలుస్తుందన్నారు. కేటీఆర్ ఎంత చెప్పినా ప్రజలు నమ్మరని, ఆయన కల్చర్ ఎలాంటిదో జగమెరిగిన సత్యమన్నారు. హైదరాబాద్ సిటీకి డ్రగ్, పబ్ కల్చర్ తెచ్చిందే ఆయన అని అన్నారు. తెలంగాణ పరువు తీసిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. ఇప్పుడు పెద్దపెద్ద డైలాగులతో జనాన్ని నమ్మించాలని చూసే ప్రయత్నాలు బెడిసికొడతాయన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>