స్పీకర్​ నిర్ణయంపై ఆ ఇద్దరు ఎమ్మెలేలు ఏమన్నారంటే?

కలం, వెబ్​ డెస్క్​ : ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సదరు ఎమ్మెల్యేలకు ఉపశమనం లభించినట్లయింది. స్పీకర్ నిర్ణయం వెలువడిన అనంతరం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి (Danam – Kadiyam) మీడియాతో మాట్లాడారు.

విరుద్ధంగా ఎప్పుడూ వ్యవహరించలేదు : దానం

తాను శాసనసభ పరిధిలో ఎన్నడూ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని దానం నాగేందర్ (Danam Nagender) అన్నారు. అసెంబ్లీలో పార్టీ ఆదేశాలను ధిక్కరించలేదని, విప్ జారీ చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఓటు వేయలేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ తాను విప్ ఉల్లంఘనకు పాల్పడి ఉంటే, ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. అసలు తనకు పార్టీ నుంచి ఎలాంటి విప్ కూడా అందలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పార్టీ పరంగా కూడా తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన వివరించారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ గానీ, క్రమశిక్షణా కమిటీ గానీ తనను ఎప్పుడూ వివరణ కోరలేదని దానం నాగేందర్ తెలిపారు. స్పీకర్ పరిధిలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే తనపై దాఖలైన పిటిషన్లు చెల్లవని ఆయన వాదించారు. తనపై పిటిషన్ వేసిన వారు వ్యక్తిగత హోదాలో వేశారని, అసలు వారికి తనను ప్రశ్నించే అధికారం ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

ఆ పిటిషన్లు చట్టబద్దం కావు : కడియం

స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నానని కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. తమపై వేసిన పిటిషన్లు చట్టబద్దం కావని, పార్టీ ఫిరాయిస్తే షోకాజ్ నోటీసులు ఇవ్వాలి కానీ, తనకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వలేదన్నారు. పార్టీ పరంగా బీఆర్ఎస్ (BRS) ఎందుకు పిటిషన్ వేయలేదని కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నానన్నారు. మేం 38 మంది సభ్యులం, దాని ప్రకారం సమయం కావాలని అసెంబ్లీలో అడిగారన్నారు.

బీఆర్‌ఎస్‌ఎల్పీకి (BRSLP) ప్రతినెల తమ జీతం నుంచి రూ. 5 వేలు జమ అవుతున్నాయని తెలిపారు. తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని, అధినాయకత్వానికి దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. కానీ ప్రజల కోసం మేం పని చేస్తున్నామని అన్నారు. గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీరు కాదా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి మంత్రులను కూడా చేశారని, పార్టీ ఫిరాయింపులకు సూత్రదారులు మీరే అని కడియం పేర్కొన్నారు.

Read Also: కాళేశ్వరం కేసుపై కదలిక?… సిటీలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>