కలం, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరిలకు (Kadiyam Srihari) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) క్లీన్ చిట్ ఇవ్వడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి కూడా అనర్హత నుంచి మినహాయింపు ఇవ్వడం అంటే, ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.
పార్టీ ఫిరాయింపులను (Party Defection) ప్రోత్సహిస్తూ స్పీకర్ వెలువరించిన ఈ తీర్పు ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి రోజుగా నిలిచిపోతుందని కేటీఆర్ విమర్శించారు. ఇది కేవలం ఒక సాధారణ నిర్ణయం మాత్రమే కాదని, అధికారంలో ఉన్న వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఓట్లతో పొందిన పదవులను కేవలం వ్యక్తిగత లాభాల కోసం అమ్ముకోవడం, దానికి స్పీకర్ వంటి ఉన్నతమైన వ్యవస్థ ముద్ర వేయడం వల్ల ప్రజాస్వామ్య విలువలకే ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు వ్యవస్థల మీద ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని కేటీఆర్ హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న తీరును తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారికి ప్రజలు సరైన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు.
Read Also: స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం : ఎన్.రాంచందర్ రావు
Follow Us On: Instagram

