epaper
Friday, January 23, 2026
spot_img
epaper

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా!

క‌లం, వెబ్ డెస్క్: ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(World Health Organization)లో 80 ఏళ్ల సభ్యత్వానికి అమెరికా ముగింపు ప‌లికింది. తాజాగా డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలిగిన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొత్త‌లోనే స‌భ్య‌త్వ విర‌మ‌ణ‌కు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. కోవిడ్(Covid) మహమ్మారి సహా పలు గ్లోబల్ ఆరోగ్య సంక్షోభాలను ప‌రిష్క‌రించ‌డంలో డబ్ల్యూహెచ్‌వో(WHO) విఫ‌ల‌మైంద‌ని ట్రంప్‌ ఆరోపించారు. అలాగే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు అమెరికా చెల్లిస్తున్న భారీ ఆర్థిక భారం అన్యాయమని ట్రంప్ పేర్కొన్నారు.

ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌లో సభ్యదేశాల జనాభా, ఆర్థిక స్థితిని బట్టి చెల్లింపులు ఉంటాయి. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా నుంచి డబ్ల్యూహెచ్‌వోకు వెళ్లే నిధులను నిలిపివేశారు. అలాగే అక్క‌డ‌ పని చేస్తున్న అమెరికన్ కాంట్రాక్టర్లను వెనక్కి ర‌ప్పించారు. భవిష్యత్తులో ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలతో కలిసి పని చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని ట్రంప్‌ ఆదేశించారు. అమెరికా 2026 జనవరి 22 నుంచి అధికారికంగా సభ్యత్వం నుంచి వైదొలగనున్నట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్లో పేర్కొంది. అయితే ఈ విషయం ఇంకా సంస్థ పాలక మండలి పరిశీలనలో ఉందని వెల్లడించింది. 1948లో అమెరికా డబ్ల్యూహెచ్‌వోలో చేరినప్పుడు, ఒక ఏడాది ముందస్తు నోటీసు ఇస్తే నిష్క్రమించే హక్కు ఉంటుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ట్రంప్ ప్రభుత్వం ఆ నిబంధనను అనుసరించింది.

ఈ నిర్ణయంపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేయేసస్ స్పందించారు. అమెరికా నిర్ణయం వల్ల అమెరికాకే కాకుండా ప్రపంచానికే నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్య భద్రత విషయంలో డబ్ల్యూహెచ్‌వోతో కలిసి పని చేయకుండా అమెరికా సురక్షితంగా ఉండలేదని స్పష్టం చేశారు. అమెరికా తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>