కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను (KTR phone tapping case) సిట్ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ఏ 4గా ఉన్న రాధాకిషన్ రావును, కేటీఆర్‌ను కలిపి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. వివిధ అంశాలకు సంబంధించి వీళ్లిద్దరినీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో పలువురు వ్యాపారవేత్తలను బెదిరించినట్టు రాధాకిషన్ రావు మీద ఆరోపణలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ రికార్డుల ఆధారంగా వారిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడని.. బీఆర్ఎస్ పార్టీకి మేలు చేకూర్చాడని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పట్లో కేటీఆర్ ఆదేశాల మేరకే రాధాకిషన్ రావు ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఈ ఆధారాల ఆధారంగా ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్టు సమాచారం. పక్కా వివరాలతో సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఇద్దరినీ ఒకేసారి విచారిస్తూ కేసుకు సంబంధించిన వివిధ అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఎన్నికల వ్యూహాల దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గతంలో రాధాకిషన్ రావు అంగీకరించినట్టు వార్తలొచ్చాయి.
రాధాకిషన్‌రావు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్‌కు ఈ వ్యవహారంపై ఎంతవరకు సమాచారం ఉందన్న కోణంలో సిట్ ప్రశ్నలు సంధిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాధాకిషన్‌రావు చెప్పిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలు, అప్పటి ఉన్నతాధికారుల పాత్ర, రాజకీయ నాయకుల ప్రమేయం వంటి అంశాలపై కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆదేశాలు ఎవరి సూచనలతో జరిగాయన్న విషయంపై సిట్ స్పష్టత కోరుతున్నట్టు సమాచారం.
అదే సమయంలో, రాధాకిషన్‌రావు గత విచారణలో వెల్లడించిన అంశాలు, కేటీఆర్ (KTR phone tapping case) చెబుతున్న సమాధానాలను సిట్ అధికారులు పోల్చి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు చెప్పే విషయాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? లేదా ఒకే తరహా సమాధానం ఇస్తున్నారా? అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారట.
ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు, నేతల వాంగ్మూలాలు నమోదు చేసిన సిట్, విచారణను మరింత లోతుగా కొనసాగిస్తోంది. కేటీఆర్ విచారణ పూర్తయ్యాక తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశముంది.


