epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

పంబన్​ బ్రిడ్జి.. ఆధునిక రామసేతుకు ఆఖరి వీడ్కోలు

కలం, వెబ్​డెస్క్​:  Pamban Bridge | వేల ఏళ్ల నుంచి భరత భూమికి రామాయణంతో ఉన్న బంధం ఎంతో గొప్పది. అందుకే భారతీయుల సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వం, జీవనంలో రామాయణం ముద్ర అడుగడుగునా కనిపిస్తుంది. అందులోని సంఘటనలు, పాత్రలు, ప్రాంతాలకు భారతీయులకు ఉన్న సంబంధం అలాంటిది. రామాయణం గురించి తలచుకోగానే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నలు, సీతాదేవి, హనుమ ఎలా గుర్తుకొస్తారో.. అయోధ్య, జనకపురి, లంక లాంటి చారిత్రక ప్రాంతాలూ అలాగే స్ఫురిస్తాయి. అలా గుర్తొచ్చేదే రామసేతు. సీతాదేవి లంకలో ఉందని తెలియగానే, అక్కడికి వెళ్లడానికి వానర సేన సాయంతో సముద్రంపై శ్రీరామచంద్రుడు నిర్మించిన వంతెనగా ఈ రామ సేతుకు ఎంతో ప్రాశస్త్యం ఉంది.

కాలక్రమంలో రామసేతు కనుమరుగైనా, ఆనవాళ్లు మాత్రం ఇప్పటికీ ఉన్నాయని భారతీయులంతా నమ్ముతారు. ఈ నేపథ్యంలో.. కొన్ని వందల ఏళ్లకు రామసేతుకు సమీపంలోనే మరో ఆధునిక వంతెన వచ్చింది. అదే పంబన్​ బ్రిడ్జి. ఆధునిక రామసేతుగా ప్రసిద్ది చెందిన ఈ వంతెన.. వందేళ్లకు పైగా రాకపోకలకు ఉపయోగపడింది. అయితే, ఇప్పుడీ వంతెనను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో పంబన్​ బ్రిడ్జి గురించిన కొన్ని విశేషాలివి.

బ్రిటీష్​ కాలంలో పునాది, పూర్తి..

బ్రిటీష్​ పాలన కాలంలో వాణిజ్యావసరాల కోసం శ్రీలంకకు వంతెన నిర్మించాలని ప్రయత్నించారు. దీని కోసం పంబన్​ దీవిలోని ధునుష్కోడి నుంచి శ్రీలంక తీరానికి బ్రిడ్జి కట్టాలనుకున్నారు. ఇక్కడే రాముడు కట్టినట్లుగా భావించే రామసేతు ఆనవాళ్లు ఉన్నాయి. అయితే, ఇక్కడ బ్రిడ్జి కట్టడం అంత సులువు కాదు. కారణం.. భౌగోళిక పరిస్థితులు. సముద్రం లోతు ఎక్కువ ఉండడం, సుడిగుండాల ముప్పు, తుపానుల భయంతో బ్రిటీష్​ పాలకులు తమ ఆలోచన విరమించుకున్నారు. దీనికి బదులుగా పంబన్​ దీవిని, భారత ప్రధాన భూభాగాన్ని కలుపుతూ ఒక రైలు వంతెన నిర్మించాలని అనుకున్నారు. అలా పుట్టిన ఆలోచనే పంబన్​ బ్రిడ్జికి పునాది వేసింది. 1911లో ప్రణాళికలు సిద్ధం కాగా, 1913లో నిర్మాణం పూర్తయ్యింది. 2.5 కిలోమీటర్ల దూరం నిర్మించిన ఈ రైలు వంతెన 1914 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. అప్పట్లో రూ.20లక్షలతో ఈ బ్రిడ్జి కట్టారు.

ఇంజనీరింగ్​ అద్భుతం..

బ్రిటీష్​ ఇంజనీర్ల సారథ్యంలో కట్టిన ఈ వంతెన (Pamban Bridge) ఇంజనీరింగ్​ అద్భుతం. ఇది భారతదేశంలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి రైలు వంతెన. దీని నిర్మాణంలో 40 అడుగుల పొడవైన స్టీల్​ గర్డర్లతో కట్టిన 145 స్పాన్లు, షెర్జర్​ లిఫ్ట్​ స్పాన్​ ఉన్నాయి. ఈ బ్రిడ్జిలో ప్రధానమైన ప్రత్యేకత ఏంటంటే డబుల్​–లీఫ్​ బాస్య్కూల్. నౌకలు వెళ్లేందుకు వీలుగా ఈ బాస్క్యూల్​ భాగం మధ్యలో విడిపోయి పైకి వెళుతుంది. దీంతో ఓడలు అటూ ఇటూ ప్రయాణించేవి. దీని వల్ల ఈ ప్రాంతం గుండా జరిగే వాణిజ్యానికి ఎంతో మేలు జరిగింది. అంతేకాదు, పంబన్​ దీవిలోని ప్రఖ్యాత రామేశ్వరం ఆలయానికి వెళ్లే యాత్రికులకు, అక్కడి ప్రజల రాకపోకలకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగపడింది.

తుపానుతో దెబ్బతిని..

1964లో వచ్చిన భారీ తుపాను పంబన్​ బ్రిడ్జిని దెబ్బతీసింది. తుపాను సమయంలో వంతెన మీద వెళ్తున్న రైలు సముద్రంలో పడి కొట్టుకుపోయింది. ఈ సంఘటనలో 115 మంది మరణించారు. వంతెన భారీగా దెబ్బతింది. అయితే, ప్రభుత్వం 6 నెలల్లోనే బ్రిడ్జికి మరమ్మతులు చేసి, అందుబాటులోకి తెచ్చింది. ఈ అనుభవంతో మేల్కొన్న భారత ప్రభుత్వం పాత వంతెనకు సమాంతరంగా మరో రోడ్డు బ్రిడ్జిని 1988లో పూర్తిచేసింది. మరి కొన్నేళ్లకు పాత రైలు బ్రిడ్జిని దెబ్బతినడంతో కొత్త రైలు, రోడ్డు వంతెన కట్టాలని ప్రభుత్వం భావించింది. ఆ క్రమంలో 2019లో కొత్త వంతెన నిర్మాణం మొదలై, 2025లో పూర్తయ్యింది. పాత వంతెనలో ఉన్న డబుల్​ –బాస్క్యూల్​ లీఫ్​కు బదులుగా ఇందులో వర్టికల్​ లిఫ్ట్​ అమర్చారు. సముద్రంలో నౌకలు వచ్చినప్పుడు ఇది పైకి వెళుతుంది. మరోవైపు పాత రైలు వంతెనపై 2022లోనే రాకపోకలు నిలిపివేశారు. దాదాపు 105 ఏళ్లు సేవలందించిన ఈ వంతెనపై రాకపోకలు ఆగిపోయాయి. ఈ బ్రిడ్జి మీద చివరిగా సేతు ఎక్స్​ప్రెస్​ ప్రయాణించింది. అనంతరం బ్రిడ్జిని మూసేశారు. ఇప్పుడు ఏకంగా తొలగించాలని నిర్ణయించారు.

నాలుగు నెలల్లో కనుమరుగు..

పాత పంబన్​ రైల్వే బ్రిడ్జిని తొలగించేందుకు రైల్వే వికాస్​ నిగమ్​ లిమిటెడ్​(ఆర్​ఐఎన్​ఎల్​) రూ.2.81కోట్లతో టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు ఓకే అయితే నాలుగు నెలల్లో వంతెన కనుమరుగు కానుంది. మొదట లిఫ్ట్​ స్పాన్​ను తొలగిస్తారు. ఆ తర్వాత మిగిలినవి తరలిస్తారు. మొత్తంగా 1,100 టన్నులకు పైగా స్టీల్​, యంత్రాలను తొలగించాల్సి ఉంటుంది. తొలిగింపు ప్రక్రియను డ్రోన్​ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. వీడియోలు తీస్తారు. అయితే, సాంస్కృతికంగా, వారసత్వంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ బ్రిడ్జి అవశేషాలను మ్యూజియంలో భద్రపరచాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also: నితిన్ నబిన్ రాజ్యసభకు వెళ్లబోతున్నారా?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>