కలం, డెస్క్ : ఎనిమిది నెలల్లోనే నెలకు ఒకటి చొప్పున ఎనిమిది యుద్ధాలు ఆపినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పుకుంటున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది? తనకన్నా మించిన ‘పీస్ ప్రెసిడెంట్’ ఎవరూ లేరని, నోబెల్ శాంతి బహుమతికి తనకన్నా అర్హత ఎవరికీ లేదని ఆయన చెప్తున్నదాంట్లో నిజం ఎంత? వార్ లకు ట్రంప్ బారికేడ్లు వేశారా?! ట్రంప్ ఆపేవరకూ అసలు ఆ దేశాలు యుద్ధానికి వెళ్లాలనే మూడ్ లో ఉండెనా?! ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏమిటి?!! వెనిజువెలా, గ్రీన్ ల్యాండ్.. ఇలా వరుస పెట్టి పలు దేశాలను తమ దేశాలేనంటూ అమెరికా ప్రెసిడెంట్ ప్రకటిస్తున్న వేళ.. ఈ అంశం గ్లోబల్ గా హీట్ పుట్టిస్తున్నది.
ఆ దేశాలు ఏమిటి?
2025 జనవరిలో అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలుత ట్రంప్ (Donald Trump) చెప్పిన మాట.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాననీ!! ఇప్పటికీ ఆ రెండు దేశాల నడుమ నిరంతరం ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆపేందుకు రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్ స్కీతో విడివిడిగా తన అధికారిక నివాసం వైట్ హౌస్ లో ట్రంప్ చాలా సార్లు చర్చోపచర్చలు జరిపారు. అయినా.. ఎక్కడిది అక్కడే ఉంది. అయితే, నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచి ట్రంప్ .. తాను ఎనిమిది దేశాల యుద్ధాలు ఆపినట్లు పదే పదే చెప్తూ వచ్చారు. నిన్నటికి నిన్న నార్వే ప్రధానికి ఓ లేఖ రాస్తూ.. తనకు పీస్ ప్రైజ్ ఇవ్వకపోవడం వెనుక నార్వే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ప్రపంచ శాంతికి పాటుపడుతున్న తనకంటే అర్హత ఉన్నవాళ్లు ఎవరని ప్రశ్నించారు. పీస్ ప్రైజ్ రాలేదు కాబట్టి.. తాను సరికొత్త అవతారం చూపించాల్సి ఉంటుందని గరం అయ్యారు. గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకొని తీరుతామని తేల్చిచెప్పారు.
ట్రంప్ ఆపినట్లుగా చెప్తున్న ఎనిమిది యుద్ధాలు ఇవే:
1. థాయిలాండ్ – కాంబోడియా; 2. రువాండా – కాంగో; 3. ఈజిప్ట్ – ఇథియోపియా; 4. సెర్బియా – కొసావో; 5. ఇజ్రాయిల్ – హమాస్ ; 6. ఇజ్రాయిల్ – ఇరాన్; 7. అర్మేనియా – అజర్ బైజాన్; 8. ఇండియా – పాకిస్తాన్.
ఆ దేశాల్లో తాజా పరిస్థితి ఏమిటీ?
1. థాయిలాండ్ – కాంబోడియా:
థాయిలాండ్, కాంబోడియా నడుమ చాలా సంవత్సరాల నుంచి సరిహద్దు వివాదం కొనసాగుతున్నది. ఈ విషయంలో ట్రంప్ ముందుకొచ్చి.. ఇరు దేశాలతో శాంతి ఒప్పందం చేయించినట్లు ప్రకటించారు. ‘‘ఇది భీకర యుద్ధానికి ముగింపు. థాయ్ ప్రధానితో నేను మాట్లాడిన. సీజ్ ఫైర్ కు అంగీకరించారు. ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపకపోతే టారిఫ్ లను మరింత పెంచుతాం” అని జులై 26న ట్రంప్ చెప్పుకొచ్చారు. మలేషియా వేదికగా శాంతి ఒప్పందం కుదిరిందని ఆ తర్వాత ప్రకటించారు. ఇప్పటికీ ఆ రెండు దేశాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
2. రువాండా – కాంగో:
రువాండా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాల మధ్య వివాదం ఇప్పటిది కాదు. గతేడాది ప్రారంభంలో తూర్పు కాంగోలోని ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న ఏరియాలను ఎం23 రెబల్స్ గ్రూప్ స్వాధీనం చేసుకోవడంతో ఇరు దేశాలు మళ్లీ భగ్గుమన్నాయి. రువాండా, కాంగో మధ్య శాంతిని స్థాపిస్తానని, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఘర్షణకు ఫుల్ స్టాప్ పెడ్తానంటూ నిరుడు జూన్ లో వైట్ హౌస్ వేదికగా ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల అధినేతలను పిలిపించుకొని ఒప్పందం చేయించుకున్నారు. కానీ, దానికి తాము ఒప్పుకోవడం లేదని ఎం23 రెబల్స్ ప్రకటించారు. ఒప్పంద జరిగిన నెలరోజుల్లోనే 140 మందిని తూర్పు కాంగోలో తిరుగుబాటుదారులు చంపేశారు. ఎం 23 రెబల్స్ గ్రూప్ ను నడిపిస్తున్నది రువాండా అని కాంగో ఆరోపిస్తున్నది.
3. ఈజిప్ట్ – ఇథియోపియా:
ఈ రెండు దేశాల మధ్య ఏనాడూ యుద్ధమనే పరిస్థితే లేదు. నీళ్ల విషయంలో మాత్రం పంచాయితీలు నడిచేవి. ఇప్పటికీ నడుస్తున్నాయి. నైలు నదిపై ఇథియోపియా కట్టిన ‘గ్రాండ్ ఇథియోపియన్ రినైసెన్స్’ డ్యామ్ వల్ల తమకు నీటి వాటా తగ్గుతున్నదని, ఆ దేశంతో చర్చలు ఆగిపోయాయని గతేడాది జూన్ 29న ఈజిప్ట్ ప్రకటించింది. దీంతో ట్రంప్ జోక్యం చేసుకొని.. తాను ఈజిప్టు ప్లేస్ లో ఉంటే తప్పకుండా నైలు నది నీటిని కోరుకుంటానని, సమస్యను పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. ట్రంప్ కామెంట్లను ఇథియోపియా సీరియస్ గా తీసుకున్నది. ఈజిప్ట్, ఇథియోపియా మధ్య ఇప్పటికీ నీళ్లకు సంబంధించి ఎలాంటి శాశ్వతం ఒప్పందం జరగలేదు. కానీ, రెండు దేశాల యుద్ధాన్ని ఆపినట్లు మాత్రం ట్రంప్ (Donald Trump) పదే పదే ప్రకటిస్తున్నారు. యుద్ధమే లేనప్పుడు యుద్ధాన్ని ఆపినట్లు చెప్పుకోవడం ఏమిటని, ఉన్నది నీళ్ల సమస్య మాత్రమేనని ఇటు ఈజిప్ట్ నుంచి అటు ఇథియోపియా నుంచి విమర్శలు వస్తున్నాయి.
4. సెర్బియా – కొసావో:
ఈ రెండు దేశాల మధ్య అతిపెద్ద యుద్ధం రాకుండా తాను అడ్డుకట్ట వేశానని గతేడాది జూన్ 27 ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భీకర దాడులకు ప్లాన్ వేసుకున్నాయని తెలిసి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. “ఆ నిర్ణయం ఏమిటంటే.. ఇరు దేశాలు యుద్ధానికి దిగాలని చూస్తే మీతో మా వ్యాపారం బంద్ పెడ్తామని చెప్పిన. దీంతో శాంతించాయి” అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆ రెండు దేశాల మధ్య యుద్ధమనే సీన్ లేదు. కాకపోతే అప్పుడప్పుడు పలు విషయాల్లో పడిరాక ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ అదే సిట్యువేషన్. 2020లో ట్రంప్ తొలిసారి అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన సమక్షంలోనే ఇరు దేశాల నడుమ ఆర్థిక ఒప్పందం జరిగింది. అప్పుడు కూడా రెండు దేశాల మధ్య యుద్ధం ఏమీ లేదు.
5. ఇజ్రాయెల్ – హమాస్:
ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండేండ్లకు పైగా యుద్ధం కొనసాగుతున్నది. తాను రెండో సారి అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ నెతన్యాహూతో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘పీస్ 2025’ పేరిట ఇజ్రాయిల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అగ్రిమెంట్ చేశారు. ఈ డీల్ కుదిరిన కొన్నిరోజులకే మళ్లీ ఎయిర్ స్ట్రయిక్స్ మొదలయ్యాయి. గాజాపై ఇజ్రాయెల్.. ఇజ్రాయెల్ పై హమాస్ కూడా పోరు నడుస్తున్నది.
6. ఇజ్రాయిల్, ఇరాన్:
గతేడాది జూన్ 13న ఇరాన్ లోని న్యూక్లియర్ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో రెండు దేశాల మధ్య వార్ సిట్యువేషన్ ఏర్పడింది. 12 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే.. దాడుల విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తనకు ముందే చెప్పారని, ఆ రెండు దేశాల మధ్య శాంతికి తాను బీజం వేస్తున్నాని ట్రంప్ ప్రకటించారు. ‘‘ఇకపై అధికారికంగా ఇరాన్ సీజ్ ఫైర్ అమలు చేస్తుంది. ఆ వెంటనే ఇజ్రాయెల్ కూడా అమలు చేస్తుంది. 12 రోజుల యుద్ధం ముగిసినట్లే”అంటూ జూన్ 23న ట్రంప్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అయితే.. ఆ వెంటనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ.. తామే విజయం సాధించామని ప్రకటించారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ కూడా.. ఒక తాత్కాలిక కాల్పుల విరమణ మాత్రమే జరిగిందని, యుద్ధం ముగియలేదని తెలిపింది.
7. అర్మేనియా – అజర్ బైజాన్:
గతేడాది ఆగస్టు 8న వైట్ హౌస్ వేదికగా.. ఇటు అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇలియా అలిహేమ్, అటు అర్మేనియా ప్రధాని నికోల్ పషీన్యన్ చేతులను దగ్గరికి తీసుకొని ఒకరి చేతిలో ఒకరి చేయి వేయించి శాంతి ఒప్పందం జరిగిందంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump) ప్రకటించారు. అంతేకాదు.. ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని ఆ దేశాల అధినేతలు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే.. ఇప్పటికీ అర్మేనియన్లు ట్రంప్ తీరును తప్పుబడుతూనే ఉన్నారు. శాంతి ఒప్పందం ఏమీ లేదని అంటున్నారు.
8. భారత్ – పాకిస్తాన్ :
భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ఇప్పటివరకు యాభై, ఆరవై సార్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. వీలు దొరికిన ప్రతిసారీ ఇదే అంటుంటారు. ట్రంప్ కామెంట్లను భారత్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. తమ కాల్పుల విరమణ వెనుక మధ్యవర్తి ఎవరూ లేరని ఇండియా ఎన్నోసార్లు తేల్చిచెప్పింది. ఇరు దేశాల అంగీకారంతోనే నిర్ణయం తీసుకున్నామంటూ ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని టెర్రరిస్టుల స్థావరాలపై భారత ఆర్మీ గతేడాది మే 7న ఆపరేషన్ సిందూర్ ను చేపట్టింది. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుందని, తమ లక్ష్యం టెర్రరిజాన్ని అంతమొందించడమేనని భారత్ స్పష్టం చేసింది.
Read Also : ఒకరి మందుల చీటి మరొకరికి.. వ్యక్తి మృతి
Follow Us On: Twitter


