కలం, వెబ్ డెస్క్ : మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర (Medaram Jatara)కు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తప్పిపోయిన పిల్లలను త్వరగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు తెలంగాణ పోలీసులు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. జాతర ప్రాంగణంలో పిల్లలు ఒకవేళ తప్పిపోతే వారి ఆచూకీని సులభంగా గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ (QR Code) కలిగిన ప్రత్యేక రిస్ట్ బ్యాండ్ (wristbands) లను అందుబాటులోకి తెచ్చారు.
ఈ రిస్ట్ బ్యాండ్‌లు జాతర పరిసరాల్లోని మొత్తం 11 కీలక ప్రాంతాలలో భక్తులకు అందుబాటులో ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లల చేతికి ఈ బ్యాండ్‌లను కట్టించడం ద్వారా వారికి అదనపు రక్షణ కల్పించవచ్చు. ఎవరైనా చిన్నారి తప్పిపోయి ఒంటరిగా కనిపిస్తే, వెంటనే వారి చేతికి ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సదరు చిన్నారి తల్లిదండ్రుల వివరాలను తెలుసుకోవచ్చు. దీనివల్ల నిమిషాల వ్యవధిలోనే పిల్లలను సురక్షితంగా వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చే అవకాశం ఉంటుంది. భక్తులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, జాతర (Medaram Jatara)లో పోలీసులకు సహకరించాలని తెలంగాణ పోలీస్ అధికారులు కోరుతున్నారు.


