epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

కమ్యూనిస్టులు చెరోవైపు.. రసవత్తరంగా నల్లగొండ మున్సిపల్ ఎన్నికలు

కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు (Nalgonda Municipal Polls) రసవత్తరంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కమ్యూనిస్టులు పక్క పార్టీలపై ఆధారపడే స్థితికి వచ్చాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో ఒకరు కాంగ్రెస్ వైపు నిలబడితే.. మరొకరు బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు. నిజానికి ఉమ్మడి జిల్లా నుంచి శాసనసభ, శాసనమండలికి ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టుల నుంచి తప్పనిసరిగా ప్రాతినిధ్యం ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఏ ఒక్కరూ అడుగుపెట్టలేకపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీల్లో ఒకరైన సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం.. ఫలితంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీపీఐ నేత నెల్లికంటి సత్యంను ఎమ్మెల్సీ పదవి వరించింది. ఇదంతా పక్కనపెడితే.. గతంలో ఏ ఎన్నికలు జరిగినా కమ్యూనిస్టు పార్టీల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగి ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టించేవారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి సర్పంచ్, వార్డు స్థానాలు గెలిచారు. ఈ క్రమంలో తాజాగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలతో పొత్తులకు రెడీ అయిపోయాయి. సీపీఎం, సీపీఐ పార్టీలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లతో పొత్తుతో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన అంశం కొలిక్కి వచ్చింది.

కాంగ్రెస్‌తో సీపీఐ జత.. బీఆర్ఎస్‌తో సీపీఎం దోస్తీ..

నల్లగొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా (Nalgonda Municipal Polls) 17 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకున్నది. ఒకట్రెండు రోజుల్లో పొత్తుల అంశం అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా సీపీఎం పార్టీ సైతం బీఆర్ఎస్‌తో పొత్తు దాదాపు ఖరారయ్యింది. అయితే కొన్ని మున్సిపాలిటీల్లో పరిస్థితి కొంచెం మారిందని చెప్పాలి. నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఎం దోస్తీతో పోటీకి దిగాయి. మరికొన్ని మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేసేందుకు రెడీ అయ్యింది. కానీ చిట్యాల మున్సిపాలిటీలో మాత్రం సీపీఎం కాంగ్రెస్‌తో జత కట్టనున్నట్టు సమాచారం. అందుకు సంబందించిన ప్రాథమిక చర్చలు ఇటీవల అయ్యాయి. చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే మున్సిపాలిటీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రధాన రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే యోచనలో సీపీఎం నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

దేవరకొండ, చండూరుపై సీపీఐ ఫోకస్..

ఉమ్మడి నల్లగొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి నడవనుంది. అందులో భాగంగానే సీపీఐ పార్టీ దేవరకొండ, చండూరు మున్సిపాలిటీలతో పాటు నల్లగొండ ఒక స్థానం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు కంప్లీట్ అయ్యాయి. కాగా, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నందికొండ, హాలియా, మిర్యాలగూడ, చిట్యాల మున్సిపాలిటీల్లో సీపీఐ బలంగా లేకపోవడంతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చేందుకు చూస్తోంది. నామినేషన్లకు మరో రెండు రోజులే గడువు ఉండడంతో ఈ అంశం త్వరితగతిన తేలనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>