కేసీఆర్ ఎత్తుకు రేవంత్ పైఎత్తు..! స్టేట్‌లో హాట్ టాపిక్..

కలం, తెలంగాణ బ్యూరో : రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ (KCR) కు రాజకీయ చాణక్యుడనే గుర్తింపున్నది. ప్రత్యర్థుల ఆట ఎప్పుడు, ఎలా కట్టించాలో తెలిసినవాడిగా కేసీఆర్‌ గురించి ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. కేసీఆర్ రాజకీయ వ్యూహాల ముందు ఇతర పార్టీల నేతలు దిగదుడుపేనని గులాబీ లీడర్లు ఒకింత గర్వంగా చెప్పుకుంటారు. ఇందుకోసం ప్రత్యర్థి పార్టీల, నేతల ఎత్తుగడలను ముందుగానే పసిగట్టి కౌంటర్ స్ట్రాటజీ వేయడంలో కేసీఆర్‌ (KCR) ను మించినవారు లేరని పలు ఉదాహరణలను ప్రస్తావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ తరహాలోనే కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీనే డిఫెన్సులో పడేసేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పర్‌ఫెక్ట్ స్ట్రాటజీలను అమలు చేస్తున్నారు. నోరెత్తకుండా బీఆర్ఎస్‌ను కట్టడి చేయడంలో ఒక మేరకు ఆశించిన ఫలితాలను పొందగలిగారు. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో డ్రగ్స్ వ్యవహారం తోడైంది.

నాడు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ :

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి బీజేపీ చేస్తున్న కుట్రల గురించి కేసీఆర్ ముందుగానే పసిగట్టారని కేసీఆర్ దూరదృష్టిని అప్పట్లో గులాబీ నేతలు కొనియాడారు. అందులో భాగంగానే 2022 అక్టోబర్ 26న అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌజ్‌లో కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిదంటూ వీడియోలను విడుదల చేసిన కేసీఆర్ సంచలనంగా మారారు. ఎమ్మెల్యేలతో జరిగిన బేరసారాలకు సంబంధించిన సంభాషణలను ప్రెస్ మీట్ పెట్టి వివరించారు. వీడియో ఫుటేజ్‌ని హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు సహా దేశమంతా పంచేశారు. పక్కా ప్రణాళికతో ఫామ్‌హౌజ్‌లో కెమెరాలను బిగించి సీన్ టూ సీన్ రికార్డు అయ్యేలా వ్యవహారాన్ని నడిపించారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో గులాబీ పార్టీకి ఈ ఎపిసోడ్ పొలిటికల్‌గా ఉపయోగపడింది. సీన్ కట్ చేస్తే.. 2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొయినాబాద్ వ్యవహారంలో తెరపై కనిపించిన నలుగురూ ఓటమి పాలయ్యారు.

కేసీఆర్ వ్యూహానికి రేవంత్‌రెడ్డి కౌంటర్ స్ట్రాటజీ :

గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడి అధికారంలోకి వచ్చింది. వరుసగా రెండు టర్ములు పవర్‌లో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ పాత్రకు పరిమితమైంది. బీఆర్ఎస్ ఓటమితో గులాబీ బాస్ సైలెంట్ అయ్యారు. ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారు. అడపాదడపా పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ముందు రేవంత్ రెడ్డి సర్కార్‌ను ఇబ్బంది పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు అందింది. సీఎం రేవంత్ రెడ్డి దీన్ని పసిగట్టి కేసీఆర్‌కే ఝలక్ ఇవ్వాలనుకున్నారు. పొలిటికల్ మైలేజీ కోసం కేసీఆర్ వాడుకున్న మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌నే సీఎం రేవంత్‌రెడ్డి ఎంపిక చేసుకున్నారు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలకు ముందు వీకెండ్ పార్టీలో డ్రగ్స్ తో పైలట్ రోహిత్‌రెడ్డి దొరికిపోయారు. నాడు ఆణిముత్యం అంటూ పైలట్ రోహిత్‌రెడ్డిని కేసీఆర్ గొప్పగా పొగిడితే ఇప్పుడు డ్రగ్స్ కేసులో నిందితుడిగా నిలబడాల్సి వచ్చింది.

సీఎం స్కెచ్‌తో బీఆర్ఎస్‌కు టెన్షన్ :

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని చాలా రోజుల క్రితమే బీఆర్ఎస్ స్కెచ్ వేసింది. రైతుభరోసా, మూసీ రివర్ డెవలప్‌మెంట్, గాంధీ సరోవర్ పేరుతో అపార్టుమెంట్ల కూల్చివేత.. ఇలాంటి అంశాలను ఎంచుకున్నది. ఇక రిజర్వు బ్యాంకు అప్పులు, మంత్రులపై అవినీతి ఆరోపణలు, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్, కృష్ణా-గోదావరి జలాల్లో రాష్ట్రానికి అన్యాయం.. ఇలాంటివన్నీ సిద్ధం చేసుకున్నది. కానీ పైలట్ రోహిత్‌రెడ్డి డ్రగ్స్ ఎపిసోడ్ కాంగ్రెస్‌కు కలిసొచ్చినట్లయింది. ఈ ఘటనలో రోహిత్ రెడ్డి డ్రగ్స్ తో దొరికిపోవడమే కాక టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో బీఆర్ఎస్ గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఇంతకాలం అధికార పక్షాన్ని సభలో నిలదీయాలనుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్సులో పడింది. అధికార పార్టీని నిలదీసే సంగతేమోగానీ రోహిత్‌రెడ్డి విషయంలో ఏ స్టాండ్ తీసుకోవాలో తెలియని గందరగోళంలో పడింది. కేసీఆర్ ఎత్తుకు రేవంత్ రెడ్డి పైఎత్తు ఇప్పుడు రాష్ట్రరాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>