కలం, డెస్క్ : రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ లోక్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎట్ హోం (At Home) ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ లో బిజీగా ఉండటం వల్ల హాజరు కాలేకపోయారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావన కూడా తెరమీదకు వస్తోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వరుసగా 2021, 2022, 2023లో లోక్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం (At Home) కార్యక్రమానికి హాజరు కాలేదు. 2022, 2023లో అప్పటి గవర్నర్ తమిళి సైతో ఉన్న విభేదాల కారణంగా పరేడ్ గ్రౌండ్ కు వెళ్లకుండా ప్రగతి భవన్ లోనే జాతీయ జెండా ఎగరేశారు మాజీ సీఎం కేసీఆర్. అలాగే ఆ మూడేళ్లు గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమాలకు కూడా కేసీఆర్ హాజరుకాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి గవర్నర్ తో సత్సంబంధాలే ఉన్నాయి. 2024, 2025 లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ ఇప్పుడు అమెరికా టూర్ లో బిజీగా ఉండటం వల్ల పరేడ్ గ్రౌండ్ కు, ఎట్ హోం ఫంక్షన్ కు సీఎం రేవంత్ హాజరు కాలేకపోయారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నా సరే రిపబ్లిక్ డే వేడుకల కోసం పరేడ్ గ్రౌండ్ కు, ఎట్ హోం కార్యక్రమానికి వెళ్లలేదని.. సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో లేరు కాబట్టి ఈ సారి హాజరు కాలేకపోయారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వీరిద్దరికీ ఉన్న తేడా ఇదే అంటూ ఈ సందర్భంగా కొందరు పోస్టులు పెడుతున్నారు.


