కలం, వెబ్డెస్క్: ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టేందుకంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన సవరణల (UGC Equity Regulations) పై సుప్రీం కోర్టు స్టే విధించింది. యూజీసీ కొత్త నిబంధనలపై దాఖలైన పిటిషన్ను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. కొత్త నిబంధనలపై స్టేతోపాటు కేంద్రం, యూజీసీకి నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా సుప్రీం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త నిబంధనలు స్పష్టంగా లేవని, వీటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఉన్నత విద్యాసంస్థల్లో దక్షిణాది, ఉత్తరాది ఇలా అన్ని ప్రాంతాల విద్యార్థులు చేరతారు. తమ సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటారు. అలాంటి వాళ్లను ర్యాగింగ్ పేరుతో ఎగతాళి చేస్తుండడం బాధాకరం. దీనిని అరిట్టేందుకు ప్రత్యేక హాస్టళ్లు ఉండాలంటున్నారు. కానీ, ప్రస్తుతం సమాజంలో కులాంతర వివాహాలు సైతం జరుగుతున్నాయి. హాస్టళ్లలోనూ అందరూ కలసి ఉంటున్నారు. ఇలాంటి కలసిపోయే తత్వం, మనమంతా ఒకటే అనే భావన విద్యాసంస్థల్లో కచ్చితంగా కనిపించాలి. విద్యాలయాల్లో స్వేచ్ఛాయుత, సమ్మిళిత, సమానత్వ వాతావరణాన్ని మేం కోరుకుంటున్నాం’ అని ధర్మాసం వ్యాఖ్యానించింది.
కాగా, యూజీసీ ఈ నెల 13న విడుదల చేసిన కొత్త నిబంధనలు (UGC Equity Regulations) వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. కొత్త రూల్స్ ప్రకారం.. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు పరిశీలనకు, సమానత్వం ప్రోత్సహించేందుకు సమానత్వ బృందాలు(ఈక్విటీ కమిటీలు) ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఈ కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళల ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలి.
అయితే, ఈ నిబంధనల్లో.. కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలపై మాత్రమే కుల ఆధారిత వివక్ష జరుగుతుందనేలా ఉండడాన్ని, వాటిపైనే కమిటీలు ఏర్పాటుచేయడాన్ని పిటిషనర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీని వల్ల జనరల్ లేదా అన్ రిజర్వుడ్ కేటగిరీల వాళ్లు తమ కులం కారణంగా వివక్ష, వేధింపులకు గురైతే వారికి రక్షణ, ఫిర్యాదు పరిష్కార అవకాశాలను యూజీసీ నిరాకరించినట్లు అవుతుందని, ఇది సమానత్వానికి వ్యతిరేకమని వాదించారు.
మరోవైపు, యూజీసీ కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా చోట్ల నిరసనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని యూజీసీ కార్యాలయం వద్ద ధర్నాలు జరిగాయి. ఈ నిబంధనలను వెంటనే వెనక్కు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు డిమాండ్ చేశాయి.


